బాలీవుడ్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని ‘స్టైల్’, ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ చిత్రాలతో మంచి విజయాలను అందుకుని ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్‌గా కొనసాగుతున్న బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ను మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. అతడు సొంతంగా ఓ కంపెనీని స్థాపించి ఫిట్నెస్ సప్లిమెంట్స్‌ను విక్రయిస్తుండడం విశేషం.
ఈ కేసులో నటుడు సాహిల్ ఖాన్‌కు సిట్ అధికారులు డిసెంబరులోనే సమన్లు జారీ చేశారు. కానీ అతడు విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నాడు.
ఏప్రిల్ 25న అతడి బెయిల్ పిటీషన్ కోర్టు తిరస్కరించింది. వెంటనే డ్రైవర్ ను పిలిపించుకుని గోవాకు వెళ్లాడు. అక్కడి నుండి కర్ణాటకలోని హుబ్లీ వెళ్లాడు. పోలీసులు ఫోన్ చేసినా తీయకుండా స్విచ్చాఫ్ చేస్తూ వచ్చాడు. అక్కడి నుండి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లాడు.
ఈ లోపు అతని వెంట ఉన్న డ్రైవర్ వివరాలు సేకరించి అతని సెల్ ఫోన్ పై పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు వస్తారని పసిగట్టిన సాహిల్ హైదరాబాద్ నుండి మహారాష్ట్ర – చత్తీస్ ఘడ్ వైపు ఉన్న నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి వెళ్లాడు. నక్సల్స్ భయం, దట్టమైన అడవి, చీకటి నేపథ్యంలో ముందుకు వెళ్లేందుకు డ్రైవర్ నిరాకరించాడు. దీంతో జగదల్ పూర్ లోని ఆరాధ్య హోటల్ లో రూమ్ తీసుకున్నారు. ఆచూకీ పసిగట్టిన పోలీసులు అక్కడికి వెళ్లి అర్దరాత్రి తలుపుతట్టి అరెస్టు చేశారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో పలువరు బాలీవుడ్ స్టార్లతో పాటు నటుడు సాహిల్ ఖాన్ పేరు కూడా బయటపడింది. ఈ కేసులో భాగంగా గతేడాది డిసెంబర్లో ముంబై సైబర్ సెల్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాహిల్‌తో పాటు మరో ముగ్గురికి సమన్లు జారీ చేసింది. యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నది సాహిల్ వాదన.