నిజమే… నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో జగన్ సర్కారు అనుసరించిన వ్యూహం అడ్డం తిరిగింది. అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజా ప్రతినిధులని కూడా చూడకుండా పోలీసు కేసులు పెట్టి పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న జగన్ రెడ్డి సర్కారు అసలు రూపం బయటపడిపోయిందని చెప్పాలి. ఇప్పటిదాకా తాము ఏం చేసినా అడ్డు చెప్పేవారెవరూ లేరన్న ధోరణిలో సాగిన జగన్ సర్కారు… రఘురామకృష్ణరాజు విషయంలో అడ్డంగా బుక్కైపోయింది. మరి దీని నుంచి జగన్ సర్కారు ఎలా బయటపడుతుందో చూడాలి.
జగన్ సీఎం అయ్యాక… తన రాజకీయ ప్రత్యర్థులపై వరుసగా కేసులు నమోదు చేయిస్తూ సాగుతున్నారు. ఇప్పటిదాకా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రకుమార్ లను అరెస్ట్ చేసిన జగన్ సర్కారు.. వారికి కూడా రఘురామకృష్ణరాజు మాదిరే థర్డ్ డిగ్రీ రుచి చూపించిందనే ఆరోపణలు వినిపించాయి. అయితే తమ ప్రతిష్ఠ ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతో వారు తమపై పడిన పోలీసు దెబ్బలను బయటకు చెప్పుకోలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో రఘురామకృష్ణరాజు ధైర్యం చేసి తనపై కొనసాగిన థర్డ్ డిగ్రీని బయటకు చెప్పడం ద్వారా జగన్ ను అడ్డంగా బుక్ చేసినట్టు చెప్పాలి.
అయినా రఘురామకృష్ణరాజుపై ధర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిందని ఎలా నిర్ధారిస్తారన్న విషయానికి వస్తే… ఈ విషయంపై రఘురామకృష్ణరాజు నోరు విప్పినప్పుడే.. కోర్టు ఆవరణలోనే ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ రాజీ యత్నాలు చేశారు. అయితే అందుకు రఘురామక్ఫష్ణరాజు ఒప్పుకోలేదు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించడం, రఘురామకృష్ణరాజును వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించడం కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిందన్న దానికి సంకేతమనే చెప్పాలి. ఇక రఘురామకృష్ణరాజు కుమారుడు, కూతురు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. బుధవారం రాత్రి వారికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇక గురువారం నాడు రాజ్ నాథ్ సింగ్ తో పాటు బీజేపీ పెద్దలను వరుసపెట్టి కలుస్తున్నారు. ఇది కూడా జగన్ క్యాంపునకు షాకేనని చెప్పాలి.
అన్నింటికంటే ముఖ్యంగా… రఘురామకృష్ణరాజు తరఫున సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించడమేనని చెప్పాలి. ఎందుకంటే… అమరావతి రాజధానిలో అవినీతి చోటుచేసుకుందన్న కేసులో జగన్ సర్కారు తరఫున వాదనలు వినిపిస్తున్నది రోహత్గీనే. అందుకోసం ఆయనకు జగన్ సర్కారు ఏకంగా రూ.5 కోట్లు చెల్లిస్తోంది. అంటే.. జగన్ తరఫున వాదనలు వినిపిస్తున్న రోహత్గీ… ఇప్పుడు రఘురామకృష్ణరాజు తరఫున, జగన్ సర్కారుకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నారంటే… రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ కొనసాగడమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా రఘురామకృష్ణరాజు విషయంలో జగన్ సర్కారు నిజరూపం బయటపడిపోయిందన్న మాట.