మెగా స్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్ లో రాబోతోన్న ‘ఆచార్య’ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ మొదలెపెట్టిన చిరు వరుస హిట్లతో దూసుకుపోతుండగా….కొరటాల శివ తన మార్క్ సందేశాత్మక-కమర్షియల్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. దీంతో, వీరిద్దరి కాంబోలో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తోన్న ‘ఆచార్య’ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ట్రెండింగ్ లో ఉంది. ఇక, తాజాగా విడుదలైన
ఐటం సాంగ్ ‘శానా కష్టం’ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఆరు పదుల వయసులోనూ అదిరిపోయే స్టెప్పులతో చిరు అలరించగా….తాను కూడా తక్కువ కాదంటూ రెజీనా రెచ్చిపోయింది. అయితే, యూట్యూబ్ లో దూసుకుపోతున్న ఈ పాట అనూహ్యంగా ఓ వివాదంలో చిక్కుకుంది.
ఈ పాట తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఆర్ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. “ఏడేడో నిమరొచ్చని కుర్రాళ్ళే ఆర్ఎంపిలు అవుతున్నారే…హే ఇదేదో కొంచెం తేడాగుందే…నీ అబద్ధం కూడా అందంగుందే” అనే చరణంపై ఆర్ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యువకులు రెజీనా లాంటి స్త్రీని ముట్టుకునే అవకాశం కోసం ఆర్ఎంపీ డాక్టర్లు అవుతున్నారనే అర్థం వచ్చేలా ఈ పాట ఉందంటున్నారు.
ఈ పాట తమ వృత్తిని అవమానించేలా ఉందని తెలంగాణలోని జనగామకు చెందిన ఆర్ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గీత రచయిత భాస్కర భట్ల, దర్శకుడు కొరటాల శివలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరి, దీనిపై ‘ఆచార్య’ చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.