పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. పవన్ అభిమానులతో వ్యవహరించే తీరు తరచుగా చర్చనీయాంశం అవుతుంటుంది. పవన్ నుంచి విడిపోయినప్పటికీ గతంలో ఆయన గురించి పాజిటివ్‌గానే మాట్లాడేది రేణు. పవన్ నుంచి విడిపోయినప్పటికీ.. ఆమెను వదిన వదిన అని పిలుస్తూ సోషల్ మీడియాలో ఎంగేజ్ చేస్తూ ఉండేవాళ్లు పవర్ స్టార్ ఫ్యాన్స్. కానీ తర్వాత తర్వాత ఆమె స్వరం మారిపోయింది.
పవన్ గురించి పరోక్షంగా విమర్శలు, ఆరోపణలు చేయడం మొదలయ్యాక అభిమానుల నుంచి వ్యతిరేకత మొదలైంది. కొన్ని సందర్భాల్లో రేణు సంధించిన ప్రశ్నలు సమయోచితంగానే అనిపించాయి. ఆమె కోణంలో ఆలోచిస్తే తనకు అన్యాయం జరిగిన భావన కలిగింది. కానీ తాజాగా ఒక పవన్ అభిమానితో రేణు వాగ్వాదం చూస్తే.. ఆమె ఆలోచన తీరు చాలా తేడాగా అనిపిస్తోంది జనాలకి. ఇంతకీ ఏం జరిగిందంటే..
శనివారం పవన్, రేణుల కొడుకు అకీరా నందన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఒక పవన్ అభిమాని.. రేణును ఉద్దేశించి ఒక ట్వీట్ పెట్టాడు. అందులో.. ‘‘మేడమ్ ఇది చాలా అన్యాయం మా అకీరాని ఒకసారి అయినా చూపించండి. మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది మాకు. మీరు హైడ్ చేయకండి. అప్పుడప్పుడూ అయినా వీడియోలో అకీరా బాబుని చూపించండి’’ అని పేర్కొన్నాడు.
ఒక పవన్ అభిమానిగా ఆయన కొడుకు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టమని మర్యాదపూర్వకంగా అడిగాడు సదరు నెటిజన్. ఐతే ఈ మెసేజ్ మీద రేణు చాలా తీవ్రంగా స్పందించింది. ‘‘మీ అన్న కొడుకు??? అకీరా నా అబ్బాయి. మీరు ఒక తల్లికి పుట్టలేదా??? మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని తెలుసు. కానీ కొంచెం మాట్లాడటం పద్ధతి నేర్చుకోండి. ఇలాంటి మెసేజ్‌లు పట్టించుకోకూడదని అనుకుంటాను. కానీ ఇంత కఠినంగా మాట్లాడటం నమ్మశక్యంగా అనిపించడం లేదు’’ అని రేణు పేర్కొంది.
ఈ సంభాషణ మీద ఇంకో మెసేజ్ కూడా పెట్టింది రేణు. ఇలాంటి మెసేజ్‌లు పట్టించుకోకుండా, బ్లాక్ చేస్తూ పోతుంటానని.. కానీ ఈ రోజు తన కొడుకు పుట్టిన రోజని, ఆ రోజు ఇలాంటి కామెంట్లు చదవడం తనను బాధిస్తుందని పేర్కొంది. ఐతే ఆ అభిమాని రేణును ఒక్క మాట అనలేదు, పైగా ఎలాంటి అభ్యంతరకరమైన కామెంట్ కూడా చేయలేదు. అయినా అంత తీవ్రంగా స్పందించడం ఏంటో పవన్ అభిమానులకు అంతు బట్టడం లేదు.