అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కేసులో ప్రముఖ వ్యాపారవేత్త కమ్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను తాజాగా ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతం అటు సినీ పరిశ్రమలోనూ.. ఇటు వ్యాపార వర్గాల్లోనూ సంచలనంగా మారింది. రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకున్నట్లుగా ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. ఇంతకూ ఆయన్ను ఏ కేసులో అరెస్టు చేశారో తెలిస్తే షాక్ తినాల్సిందే. అంత పెద్ద స్థాయిలో ఉన్న రాజ్ కుంద్రా.. అలాంటి పాడు పని చేశారా? అన్న సందేహం కలుగక మానదు.
నీలి చిత్రాలను నిర్మించటం.. వాటిని కొన్ని యాప్స్ ద్వారా ఆన్ లైన్ లో పబ్లిష్ చేసిన ఉదంతానికి సంబంధించిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆయనపై ఈ ఫిబ్రవరిలోనే కేసు నమోదైంది. దీనిపై విచారణ సాగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆయన పాత్రపై కీలక ఆధారాలు లభించటంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ను కోరుతూ జూన్ లో ఆయన కోర్టును ఆశ్రయించి.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఆయనకు బెయిల్ లభించలేదు. ఇంతకూ ఈ వివాదం ఏమంటే.. నటి కమ్ మోడల్ షర్లిన్ చోప్రా స్టేట్ మెంట్ ప్రకారం.. వెబ్ సిరీస్ పేరుతో అశ్లీల వీడియోల్ని షూట్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక స్టార్టప్ కంపెనీకి చెందిన ఉద్యోగినిపై సైబర్ పోలీసులకు ఒక కంప్లైంట్ అందింది. సదరు కంపెనీ రాజ్ కుంద్రాది. అయితే.. సదరు ఉద్యోగికి ఏప్రిల్ లో బెయిల్ మంజూరైంది.
ఈ కేసులో తదుపరి విచారణ కోసం రాజ్ కుంద్రాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. తాను అప్పటికే సదరు స్టార్టప్ కంపెనీ నుంచి వైదొలిగానని.. తనకు, ఆ కంపెనీకి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సదరు వెబ్ సిరీస్ లో కానీ.. సదరు సన్నివేశాల చిత్రీకరణలో కానీ తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే.. పోలీసులకు లభించిన ఆధారాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో రాజ్ కుంద్రాను తాజాగా అదుపులోకి తీసుకొని.. అరెస్టు చేసినట్లుగా ప్రకటించారు.
ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే నటి గెహనా వశిష్ట్ తో పాటు మరికొందరిని కూడా పోర్న్ యాప్స్ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఉన్నత స్థానంలో ఉన్న రాజ్ కుంద్రా.. ఇంతకీ నీలిచిత్రాలను నిర్మించే పాడు పని చేశారా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.