తెలుగులో దర్శకుడిగా చిన్న స్థాయిలో దేశంలోనే నంబర్ వన్ స్థాయికి ఎదిగాడు రాజమౌళి. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజాలనే అబ్బురపరిచింది. దీంతో రాజమౌళి మాటలకు, ఆయన అభిప్రాయాలకు ఎంతో విలువ పెరిగింది. ఆయన తాజాగా తాను ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రాల గురించి ఒక వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ప్రమోషన్ల కోసం జపాన్ వెళ్లినపుడు అక్కడి అభిమానులు, మీడియాతో ముచ్చటించినప్పటి వీడియో అది. ఇప్పుడు అది మీడియాలోకి వచ్చింది. ఈ సందర్భంగా మీరు ఒక ప్రేక్షకుడిగా ఏయే చిత్రాలను చూసేందుకు ఎదురు చూస్తున్నారు అని అడిగితే.. ఆసక్తికర సమాధానం చెప్పాడు జక్కన్న.
ఆయన మొదటగా చెప్పిన సినిమా.. తనకు బాగా క్లోజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రమే. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తనను గత కొన్నేళ్లలో బాగా ఇంప్రెస్ చేసిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే ‘స్పిరిట్’ తాను వెయిట్ చేస్తున్న సినిమాల్లో ఒకటని జక్కన్న చెప్పాడు.
వీటితో పాటు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ‘పెద్ది’ కూడా తనకు ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో ఒకటని రాజమౌళి తెలిపాడు. జక్కన్న చెప్పిన సినిమాలేవీ ఈ ఏడాది విడుదల కాబోవు. ‘డ్రాగన్’, ‘పెద్ది’ ప్రస్తుతం జోరుగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇవి రెండూ వచ్చే ఏడాది వేసవిలోనే విడుదలయ్యే అవకాశముంది. ‘స్పిరిట్’ ఇంకా సెట్స్ మీదికే వెళ్లలేదు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో షూట్ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. అది 2027లో విడుదలయ్యే అవకాశముంది.