ఒకే రాష్ట్రం ఒకే రాజధాని పేరుతో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. నవ్యాంధ్రకు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని 600 మంది రైతులు అమరావతి టు అరసవెల్లి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రకు విపక్ష పార్టీలన్నీ మద్దతిస్తున్నాయి. అయితే, వైసీపీ నేతలు మాత్రం ఈ పాదయాత్రపై అవాకులు చవాకులు పేలుతున్నారు.
అంతేకాదు, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించిన కొత్త బిల్లును ప్రవేశపెడతామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ పాదయాత్రను నీరుగార్చేలా అమరావతికి విరుద్ధంగా వైసీపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. ఇది పాదయాత్ర కాదని, ఉత్తరాంధ్రపై దండయాత్ర అని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పాదయాత్ర, వైసీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రంగా స్పందించారు.
ఈ వ్యవహారాలపై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకు రఘురామ లేఖ రాశారు. ఈ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని, దాదాపు 1000 కిలోమీటర్ల మేర రైతులు పాదయాత్ర చేస్తున్నారని రఘురామ లేఖలో ప్రస్తావించారు. గతంలో రైతులంతా న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర చేశారని కూడా అమిత్ షాకు తెలిపారు. అమరావతి రాజధాని పై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా మంత్రులు, వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారని, 3 రాజధానుల గురించి మాట్లాడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.
కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని అన్నారు. అంతేకాదు, ఉద్దేశపూర్వకంగానే హైకోర్టు ఆదేశాలను వైసీపీ నేతలు ఉల్లంఖిస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రలో అలజడి సృష్టించడమే ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని, ఈ చర్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమనిపిస్తోందని ఆరోపించారు అందుకే, అమరావతి రైతుల పాదయాత్రకు కేంద్ర ఏజెన్సీల ద్వారా భద్రత కల్పించాలని అమిత్ షాను రఘురామరాజు రిక్వెస్ట్ చేశారు. మరి, రఘురామరాజు విజ్ఞప్తిపై అమిత్ షా ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.