జనసేన , టీడీపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఏం జరిగిందో ఏమో.. బుధవారం అర్ధరాత్రి 11-12 గంటల సమయంలో పోలీసులు రెచ్చిపోయారు. మంగళగిరిలోని ఓ అపార్ట్మెంటులో అద్దెకు ఉంటున్న 30 మంది జనసేన పార్టీ సిబ్బంది, కార్యకర్తలపై దాడులు చేసి, జులుం ప్రదర్శించారు. వారి గదుల్లోకి చొచ్చుకువెళ్లిన పోలీసులు బ్యాగులు, సూట్ కేసులు తనిఖీ చేశారు. అదేవిధంగా వారి దుస్తులను కూడా తనిఖీ చేశారు. దీంతో సుమారు రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనసేన నాయకులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరి ప్రాంతంలో జనసేన పార్టీకి పని చేసే సిబ్బంది నివసించే అపార్ట్ మెంట్లో పోలీసులు సోదాలు చేయడం కక్ష సాధింపు చర్య అని, వారి గదుల్లోకి వెళ్ళి ఎలాంటి కారణం చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉందని పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ తీరు చూస్తే కచ్చితంగా పోలీసులను ఉపయోగించి సిబ్బందిని, తద్వారా జనసేనను వేధించాలనే దురాలోచనతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
రాత్రి 11 గంటలకు రావాల్సిన అవసరం ఏమిటి? ఏ సమాచారం ఆధారంగా చేసుకొని అక్కడికి వచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు. వైసీపీ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులు పావులుగా మారడం అప్రజాస్వామికమన్నారు. ఈ చర్యలను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాలని నాదెండ్ల పిలుపునిచ్చారు. అప్రజాస్వామిక చర్యలపై మా మిత్ర పక్షాలైన తెలుగుదేశం, బీజేపీలతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇదిలావుంటే, బుధవారం మధ్యాహ్నం వరకు మంగళగిరిలోనే ఉన్న జనసేన అధినేత పవన్.. టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన హైదరాబాద్కు వెళ్లిపోయారు. అలా ఆయన వెళ్లిపోయిన అనంతరం.. ఇలా పోలీసులు దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, జనసేన కార్యకర్తలను గంజాయి కేసుల్లో ఇరికించేందుకే ఇలా దాడులు చేశారని.. టీడీపీ నాయకులు విమర్శలు గుప్పించారు. గురువారం రాష్ట్ర డీజీపీని కలుసుకుని ఫిర్యాదు చేయనున్నట్టు అవసరమైతే.. కోర్టును ఆశ్రయించనున్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఇళ్లపై దాడులు ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు.