పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఏంటి? ఆయన మామూలోడా? రోజుకు రూ.2కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే నటుడు. అంతేనా..? ఆయన పిలవాలే కానీ.. పలావు పొట్లాం గురించి ఆలోచించకుండా వేలాది మంది సభలకు తరలివస్తారు. ఆయన పిలుపునిస్తే.. విరుచుకుపడతారు. అంతటి పవర్ ఫుల్ నేత.. సార్వత్రిక ఎన్నికల వేళ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవటం వేరే విషయం. ఆకాశానికి ఎత్తినట్లే ఎత్తి.. అంతలోనే అమాంతం కింద పడేస్తారు. మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదని.. ఆయన్ను వీరగా అభిమానించే వారు.. అంతకు మించి అన్నట్లు ఆరాధించే వారికి గుస్సా రావొచ్చు.
ఇక్కడ చెప్పేదేమంటే.. పవన్ కు ప్రజాభిమానం పుష్కలం. అయితే.. రాజకీయ అంశాల విషయానికి వస్తే.. ఆయన ఆలోచనలకు.. ప్రాక్టికాలిటీకి ఏ మాత్రం పొంతన కుదరదు. అదే ఆయన్ను ఓడించేలా చేసింది. ఎన్నికల వేళలో.. పోల్ మేనేజ్ మెంట్ లో భాగంగా చేయాల్సిన పనులు చేయాల్సిందే. అందుకు భిన్నంగా విలువలు.. సిద్ధాంతాలు అంటే..పవన్ లాంటి వ్యక్తి సైతం ఓటమి చెందాల్సిందే. అదే జరిగింది.
కొన్ని విషయాల్లో పవన్ అతిమంచితనం ఆయనకు ఎదురుదెబ్బలు తగిలేలా చేస్తుందన్నది మర్చిపోకూడదు. బీజేపీకి ఆయన మిత్రుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ బీజేపీకి పవన్ అవసరం ఉందా? లేదంటే పవన్ కు బీజేపీ అవసరం ఉందా? అంటే.. దీనికి సమాధానం తెలుగు రాష్ట్రాల్లోని ఏ చిన్న పిల్లాడ్నిఅడిగినా సమాధానం ఇట్టే చెప్పేస్తారు. అలాంటప్పుడు బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం నెలల తరబడి పవన్ ఎందుకు వెయిట్ చేయాలి? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. పవన్ మంచితనే ఆయన్ను వేలెత్తి చూపేలా.. విమర్శల పాలు చేసేలా చేస్తుంది.
మిత్రుడన్న మాట ఒకసారి అనుకున్న తర్వాత.. అందుకు కట్టుబడి ఉండటమే పవన్ కు తెలుసు. అంతేకానీ.. అవకాశానికి ఓకే అనటం.. అవసరం తీరినంతనే కటీఫ్ చెప్పటం లాంటివి ఆయన బాడీ లాంగ్వేజ్ కు సూట్ కావు. అందుకు మిత్రబంధం మొదలైతే.. దాని కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని.. అవమానాల్ని ఆయన భరిస్తారే కానీ.. బయటపడిపోరు. బీజేపీ పెద్దల నుంచి కబురు వచ్చిందన్న మాటతో ఢిల్లీకి వెళ్లిన పవన్.. తీరా చూస్తే.. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్.. మురళీధరన్ తో సమావేశం కావటం కనిపిస్తుంది.
నిజానికి పవన్ లాంటి స్థాయి ఉన్న నేత.. వారితో ఎందుకు మాట్లాడాలి? అవసరమైతే.. తన పార్టీలో తన తర్వాత తన వ్యవహారాల్ని చూసే నాదెండ్ల మనోహర్ కు అప్పగించాలి కదా? తాను మాట్లాడితే గీట్లాడితే అయితే అమిత్ షా లేదంటే మోడీతో తప్పించి మాట్లాడకూడదు కదా? నడ్డాతో భేటీ అయినా మర్యాదపూర్వక భేటీనే తప్పించి మరెలాంటి మాటలు ఆయనతో అవసరం లేదు కదా? ఎందుకంటే.. ఎవరితో ఎంత మాట్లాడినా ఫైనల్ గా లెక్కలు తేలేది.. తేల్చేది మోడీషాలే తప్పించి మరెవరూ కాదు. అలాంటప్పుడు ఆయన ఎందుకంత ప్రయాసలకు లోనవుతారు? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. పవన్ కు రాజకీయ కపటం తెలీదు. అడంబరాలు ప్రదర్శించాలని అనుకోరు. కానీ.. ఇప్పుడున్న స్వార్థరాజకీయాల్లో పవన్ మాదిరి అతి మంచిగా వ్యవహరిస్తే.. ఆయనకు నష్టం వాటిల్లే కంటే.. ఆయన పార్టీకి ఇమేజ్ తగ్గుతుందన్న విషయాన్ని పవన్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు. మరేంచేస్తారో చూడాలి.