రాజకీయ విశ్లేషకులు, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ గురించి తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అయిన పరకాల…టీడీపీ హయాంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వ్యవహరించారు. సునిశితమైన విమర్శలతో రాజకీయ విశ్లేషణలు చేయడంలో పరకాలది అందెవేసిన చేయి. ప్రత్యర్థి పార్టీలపై పరకాల విమర్శలు గుప్పించినప్పటికీ…ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు.
గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన పరకాలు…2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పరకాల చేసిన ఓ ట్వీట్ తెలుగు రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. పరోక్షంగా జనసేన పార్టీని, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు తగిలేలా పరకాల చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అయింది.
‘ఇంకా కుక్కలు మొరుగుతూనే ఉన్నట్లున్నాయి. కానివ్వండి. మళ్ళీ రేపు తీరుబడి అయ్యాక ఒకొక్క కుక్కనీ మూతి పగిలేలా కొడతాను. ఏ కుక్కనీ నిరాశ పరచను. ఆఫీసుకి వెళ్ళి కిరాయి తీసుకోడం మర్చిపోకండి. రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట కూడా గెలిపించుకోలేక పోయిన వాళ్ళు అంతకన్నా ఇంకేమి చెయ్యగలరు?’ అంటూ పరకాల ప్రభాకర్ చేసిన ట్వీట్ పై ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
అయితే, ఆ ట్వీట్ లో పరకాల ఎవరి పేరును ప్రస్తావించకపోయినప్పటికీ…అది జనసేన, పవన్ ను ఉద్దేశించినదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ ట్వీట్‌కు జన సైనికులు, మరికొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంతమంది జనసైనికులు…పరకాలపై విమర్శలకూ దిగి రీట్వీట్ చేస్తున్నారు. అయితే, పరకాలను జనసైనికులు ఏదో అని ఉంటారని, అందుకే ఆయన అంత కోపంగా ఉన్నారని కొందరు అంటున్నారు.
కొంతమంది జనసైనికులు పరకాలపై చేసిన అనుచిత ట్వీట్లతోనే పరకాల ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక, 2017లో పరకాల ప్రభాకర్ పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేసిన వారి గురించి సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానని పవన్ చెప్పారు. ఈ క్రమంలోనే అవసరమొచ్చినప్పుడు పరకాల ప్రభాకర్ పని చెప్తానని అన్నారు.
అయితే, ఆనాడు పవన్ వ్యాఖ్యలపై పరకాల స్పందించలేదు.మరి, ఈ వ్యవహారంపై తాజాగా పవన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలోనూ పవన్ అభిమానులు…దివంతగ నటుడు కత్తి మహేశ్ తో చాలాకాలం సోషల్ మీడియాలో మాటల యుద్ధం చేశారు. మరి, పరకాల వ్యవహారం కూడా అలా కాకుండా పవన్ జాగ్రత్త పడతారా లేదా అన్నది వేచి చూడాలి.