ఏపీలో కరోనా విశ్వరూపం చూపిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా టెస్టుల్లో జాప్యంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, ప్రస్తుతం వ్యాక్సిన్ రెండో డోసు కావాల్సిన వారికి మాత్రమే వేస్తామంటూ వైద్యాధికారులు చెప్పడంతో తొలి డోస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు నిరుత్సాహపడుతున్నారు. ఇక, వ్యాక్సినేషన్ ప్రక్రియలో జాప్యం వల్ల వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించకపోవడంతో వ్యాక్సిన్ కోసం వచ్చి కూడా కొందరు కరోనా బారిన పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, వైన్ షాపుల ముందు మాత్రం పోలీసులు దగ్గరుండి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.
జగన్ కు తన సొంత బ్రాండ్ల మద్యం అమ్మకాలపై ఉన్న ఆరాటం ప్రజల ఆరోగ్యంపై లేదని లోకేశ్ విమర్శించారు. తాగేవాడికి అనారోగ్యం, తాగించేవాడికి ఆదాయం అని ఎద్దేవా చేశారు. మద్యం దుకాణాల వద్ద క్యూలు ఏర్పాటు చేసి భౌతికదూరం అమలు చేస్తున్నారని, కానీ, కరోనా నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రజలను మాత్రం దొమ్మీకి వదిలేశారని లోకేశ్ మండిపడ్డారు.
వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర రద్దీ వల్ల మరింతగా వైరస్ వ్యాప్తికి జనాలు కారణమవుతున్నారని ఆరోపించారు. ఇందుకు ఆధారంగా నెల్లూరు జిల్లాలో వైన్ షాపు ముందు క్యూలైన్, గుంటూరులో వ్యాక్సిన్ కేంద్రం వద్ద తోపులాట వీడియోను లోకేశ్ ట్విటర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.