దాదాపు నెల క్రితం అమెరికాలో మన తెలుగమ్మాయి జాహ్నవి చావుకు కారణమైన అమెరికా తెల్ల పోలీసోడి మీద ఎలాంటి నేరాభియోగాలు అవసరం లేదని తేల్చేశారు. విన్నంతనే.. మరీ ఇంత అన్యాయమా? అనిపించే ఈ క్రైం ఉదంతంలో మరిన్ని దుర్మార్గాలు ఉన్నాయి. గంటకు 119 కి.మీ. వేగంతో కారును డ్రైవ్ చేస్తూ.. రోడ్డు దాటుతున్న మనమ్మాయిని ఢీ కొట్టిన ఉదంతంలో సదరు పోలీసు మీద నేరాభియోగాలు మోపాల్సిన అవసరం లేదని తేల్చేయటం షాకింగ్ గా మారింది. దీనికి కారణం.. సరైన సాక్ష్యాధారాలు లేకపోవటమేనని చెప్పటం గమనార్హం.
సమగ్ర విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొనటం గమనార్హం. అంతేకాదు.. ప్రమాద సమయంలో జాహ్నవి మరణం గురించి చులకన చేస్తూ మాట్లాడిన పోలీసు అధికారి ప్రమాద స్థలంలో లేరని తేల్చారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి ఉన్నత విద్య కోసం2021లో అమెరికాకు వెళ్లటం తెలిసిందే. ఈ జనవరి 23న ఆమె రాత్రి వేళ కాలేజీ నుంచి ఇంటికి వెళుతూ రోడ్డు దాటే క్రమంలో అతి వేగంగా దూసుకొచ్చిన పోలీసు కారు కారణంగా ఆమె అక్కడికక్కడే చనిపోయారు.
కారు వేగానికి ఆమె వంద అడుగుల దూరానికి ఎగిరిపడినట్లుగా సియాటెల్ పోలీసులు తెలపటం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడటం.. ఆ మాటలు అతడి బాడీ కెమేరాలో రికార్డు కావటం.. అవి బయటకు వచ్చి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. భారతీయ అమ్మాయి ప్రాణానికి విలువలేదన్నట్లుగా మాట్లాడిన ఆ పోలీసు అధికారి మాటలు విన్నంతనే ‘ఆర్ఆర్ఆర్’ మూవీలొ విలన్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వచ్చేలా ఉండటం గమనార్హం.
చులకన మాట్లాడిన పోలీసు అధికారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో దిద్దుబాటు చర్యలకు చేపట్టిన అధికారులు.. తాజాగా ప్రమాదానికి కారణమైన పోలీసు కెవిన్ డవేపై మాత్రం నేరాభియోగాలు నమోదు చేయటం లేదని వెల్లడించటంపై విస్మయం వ్యక్తమవుతోంది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవటమే దీనికి కారణంగా కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం తాజాగా వెల్లడించింది.
జాహ్నవి మరణంపై దారుణ వ్యాఖ్యలు చేసిన మరో పోలీసు అధికారి డేనియల్ ఘటనాస్థలంలో లేడని.. అయినప్పటికీ అతడి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని.. ప్రజలకు పోలీసులపై విశ్వాసం తగ్గించేలా ఉన్నాయని పేర్కొన్నారు. అతడిపై అస్పట్లోనే సస్పెన్షన్ వేటు పడటం.. అతడిపై చర్యలకు తుది విచారణ మార్చి నాలుగున జరగనుంది. ఏమైనా.. ఒక విద్యార్థిని మరణానికి కారణమైన పోలీసును ఈ రీతిలో విడిచిపెట్టటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.