అసెంబ్లీలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు మరీ దిగజారి ఆ తరహాలో వ్యాఖ్యానించడాన్ని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఖండించారు. ఆ వ్యాఖ్యల వల్ల మనసుకు బాధ కలిగినా వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలని, వీటిని పట్టించుకుంటూ పోతే సమయం వృథా అని నారా భువనేశ్వరి గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై భువనేశ్వరి మరోసారి స్పందించారు. తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరైన భువనేశ్వరి…వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఏ మహిళను అవమానించినా అది సమాజానికి మంచిది కాదని భువనేశ్వరి హితవు పలికారు. ఆవేశంలో తప్పులు చేసి పాపాత్ములు అనిపించుకోవద్దని, ఇతరుల పట్ల సానుభూతి, దయతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అసూయ, ద్వేషాల స్థానంలో ప్రేమను పంచాలని అన్నారు. ఇతరుల వ్యాఖ్యలను తాను పట్టించుకోబోనని భువనేశ్వరి మరోసారి స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ ట్రస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని, ప్రభుత్వం నుంచి ట్రస్టు ఏమీ ఆశించడం లేదని అన్నారు. భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో ప్రజలకు సాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇటీవల సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన 48 మందికి ఎన్టీఆర్ ట్రస్టు తరఫున భువనేశ్వరి సాయం అందించారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. సాయం అందుకున్నవారిలో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందినవారున్నారు.