సినీ నటుడు, వ్యాఖ్యాత అక్కినేని నాగార్జునకు చెందిన `ఎన్` కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు శనివారం ఉదయం కూల్చి వేసిన విషయం తెలిసిందే. మాదాపూర్‌లో ఉన్న ఈ కన్వెన్ను చెరువు భూములను ఆక్రమించి నిర్మించారన్నది.. హైడ్రా వాదన. అంతేకాదు.. తాము నోటీసులు ఇచ్చినా.. అక్కినేని నాగార్జున పట్టించుకోలేదన్నది వారి ఫిర్యాదు. ఈ నేపథ్యంలో సదరు నిర్మాణాన్ని కూల్చివేయాల్సి వచ్చిందని శనివారం ఉదయం చెప్పుకొచ్చారు.
అయితే.. హైడ్రావాదనలతో నాగార్జున విభేదించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నా రు. అంతేకాదు.. ఈ కట్టడం కూల్చివేతపై కోర్టు స్టే ఇచ్చిందని,.. అయినా కూల్చివేశారని.. ఈ నేపథ్యంలో తాము కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని నాగార్జున చెప్పుకొచ్చారు. తమకు న్యాయం దక్కుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన.. ఎక్స్‌లో పోస్టు చేశారు. తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఎక్స్‌లో ఇలా పోస్టు చేయాల్సి వచ్చిందని నాగార్జున పేర్కొన్నారు.
తాము ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేయలేదన్నారు. నిర్మాణం జరిగిన భూమికి ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉందన్నారు. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు. ప్రైవేట్ స్థలంలోనే దీనిని నిర్మించామని.. ఎక్కడా సర్కారు భూమిని కబ్జా చేయలేదని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టుకు వెళ్లినప్పుడు.. తమకు అనుకూలంగా కోర్టు `స్టే` ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం జరిగిందంతా.. చట్ట విరుద్ధమేనని తెలిపారు.
కోర్టు ఇప్పటికే స్టే ఇచ్చినా .. దూకుడుగా కూల్చి వేతకు పాల్పడడం సరికాదని నాగార్జున పేర్కొన్నారు. “చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం“ అని నాగార్జున తెలిపారు. కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు పేర్కొన్నారు.