ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది మొదలు..చివరకు హైకోర్టు ఎన్నికలను రద్దు చేసేవరకు…ఏపీలో పొలిటికల్ హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ లో సీఎం జగన్, వైసీపీ నేతలు, సీఎస్ నీలం సాహ్నిలు ఇబ్బంది పడ్డారన్నది జగను…జగము…ఎరిగిన సత్యాలే. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరికన్నా ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారన్నది అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన చేదు నిజం.
సాధారణంగా ఎన్నికల్లో అధికార పార్టీ అండదండలున్నప్పటికీ…ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎంతోకొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అప్పుసప్పు చేసో…ఆస్తులమ్ముకొనో డబ్బు ఖర్చుపెట్టిన తర్వాత ఎన్నికల్లో గెలిస్తే గులాములు…సలాములు. అదే, ఓడిపోతే…ఓదార్పులు, ఊరడింపులు. కానీ, అంత డబ్బు ఖర్చుపెట్టిన తర్వాత….ఆ ఎన్నికలు పూర్తయి…ఫలితాలు వస్తాయనుకుంటున్న సమయంలో రద్దయితే? అటు ఇటు కాని….ఆ పరిస్థితి వర్ణనాతీతం. ప్రస్తుతం ఏపీలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టే ఉంది.
అయితే, ఎన్నికలు రద్దు చేస్తున్నట్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా అప్పీలుకు వెళ్లలేదు. ఇప్పటికే ఏపీ సర్కార్, సీఎస్ సాహ్నికి హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ఎస్ఈసీ ఆ సాహసం చేస్తుందో లేదో తెలియని పరిస్థితి. కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో…ఎస్ఈసీ న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తోందట.
ఇక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికయిన వారిది మరో బాధ. రద్దయిన ఎన్నికలతోపాటు తమ ఏకగ్రీవాలు కూడా రద్దవుతాయా లేదా అన్న డైలమాలో వీరున్నారట. అయితే, ఎస్ఈసీగా నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ వరకే రద్దయిందని, పాత నోటిఫికేషన్ ప్రకారం జరిగిన ఏకగ్రీవాలకు ఢోకా లేదని న్యాయ నిపుణులు అంటున్నారట. ఏది ఏమైనా, జగన్ అనాలోచిత నిర్ణయాలు, తొందరపాటు వల్ల జరిగిన ఎన్నికల వల్ల అభ్యర్థులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారని విమర్శలు వస్తున్నాయి.