ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని వంటిదని, వైసీపీ తరఫున పోటీ చేసిన 25 మంది ఎంపీలను ప్రజలు గెలిపిస్తే కేంద్రాన్ని నిలదీసి ప్రత్యేక హోదా సాధిస్తామని నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు బల్లగుద్ది మరీ చెప్పిన సంగతి తెలిసిందే. జగన్ మాటను నమ్మిన జనం…నిజంగానే హోదా తెచ్చేస్తారన్న ఆశతో వైసీపీకి 22 మంది ఎంపీలను కట్టబెట్టారు. అయితే, వైసీపీ ఎంపీలు పార్లమెంటులో అడుగుపెట్టి రెండేళ్లు గడుస్తున్నా….హోదా గురించి కేంద్రాన్ని గట్టిగా నిలదీసిన పాపాన పోలేదు. ఇక, వైసీపీ అధినేత జగన్…కాలికి బలపం కట్టుకొని మరీ ఎన్నోమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.
అయితే, వెళ్లిన ప్రతిసారి…సొంత ఎజెండా…లేదంటే పోలవరం, కోవిడ్ నిధుల విషయం తప్ప మరో ఊసుండదని టాక్. ఇలా విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే జగన్….ఈసారికి మోడీ సర్కార్ ను హోదా అడగలేము…కేంద్రంలో ప్రభుత్వం మారితేనే హోదా విషయం తేలుతుందని గతంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందని… అందుకు జగన్ రెడ్డి ఏం చేస్తారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హోదాపై ఏపీ ప్రజలను, యువతను జగన్ రెడ్డి మోసగించారని, జగన్ ను అందరూ నిలదీయాలని అన్నారు. కేసుల కోసం జగన్ కేంద్రం పెద్దలతో చీకటి ఒప్పందాలు చేసుకొని లాలూచీ పడ్డారని ఆరోపించారు. తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. 25 మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రం మెడలు వంచి హోదా తీసుకువస్తానని ఆనాడు జగన్ చెప్పారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేస్తూ చురకలంటించారు.
హోదా వస్తేనే ఏపీకి పెట్టుబడులు, ఉద్యోగాలు, నిధులు వస్తాయని యువతను నమ్మించి జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. మొత్తం 28 మంది ఎంపీలున్నా కేంద్రాన్ని నిలదీయడం లేదని విమర్శించారు. ఓట్లు దండుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికే జగన్ రెడ్డి హోదాను వినియోగించుకున్నారని నిప్పులు చెరిగారు. అక్రమాస్తుల కేసుల్లో జైలుకు పంపిస్తారనే భయంతో కేంద్రాన్ని జగన్ గట్టిగా అడగలేకపోతున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.