మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ, నటి నవనీత్ కౌర్ తెలుగు ప్రజలకు సుపరిచితురాలే. టాలీవుడ్ లో జగపతిబాబు సరసన జగపతి చిత్రం, ఆర్ఫీ పట్నాయక్ తో శ్రీను వాసంతి లక్ష్మి చిత్రాలతోపాటు పలు తెలుగు చిత్రాలలో నవనీత్ కౌర్ నటించి మెప్పించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన నవనీత్…2019 ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. తొలిసారి ఎంపీ అయినప్పటికీ…నవనీత్ కౌర్ సభలో తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి పదునైన ప్రసంగంతో ఆకట్టుకుంటున్నారు.
ఇక, తాజాగా ముగిసిన పార్లమెంటు సమావేశాల చివరిరోజు నవనీత్ కౌర్ మాట్లాడుతున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది.
లోక్ సభలో ఓబీసీ బిల్లుపై చర్చ సందర్భంగగా రాజంపేట ఎంపీ, ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డి ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి, నవనీత్ కౌర్ మధ్య తెలుగులో ఆసక్తికర సంభాషణ సాగింది. ఓబీసీ బిల్లుపై ప్రసంగిస్తున్న నవనీత్ కు సమయం అయిపోయిందని మిథున్ రెడ్డి బెల్ కొట్టారు.
అయితే, తాను స్వతంత్ర ఎంపీనని, తనకు మాట్లాడేందుకు మరి కొద్ది నిమిషాలు సమయం ఇవ్వాలని నవనీత్ కోరారు. అయితే, సభ ముగింపునకు వచ్చిందని, సమయం ఇవ్వలేనని మిథున్ చెప్పారు. దీంతో, సార్… మీరు తెలుగు మాట్లాడే సభ్యులు. నేను కూడా తెలుగు మాట్లాడతాను. మీరు స్పీకర్ చైర్లో ఉన్నారు…. నాకు మరో నిమిషం మాట్లాడే చాన్సివ్వండి’ అంటూ నవనీత్ తెలుగులో మిథున్ రెడ్డికి రిక్వెస్ట్ చేయడంతో మిథున్ రెడ్డి సహా సభ్యులంతా షాకయ్యారు.
నవనీత్ తెలుగులో మాట్లాడడంతో…మీరు మహారాష్ట్రకు చెందిన వారు కదా అని తోటి సభ్యురాలు నవనీత్ ను ఉద్దేశించి అన్నారు. దీనికి, నవనీత్…తాను మహారాష్ట్రకు చెందిన దానినేనని, అందుకు గర్వపడతానని చెప్పారు. అదే సమయంలో తాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కూడా చెందిన దానినేనని, ఆ రాష్ట్రాలతో తనకు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తెలుగులో నటించి చాన్నాళ్లయినా..తెలుగు గుర్తుపెట్టుకొని, ఆ రాష్ట్రాలతో ఉన్న అనుబంధాన్ని నవనీత్ గుర్తు పెట్టుకోవడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.