తన కుటుంబంలో జరుగుతున్న వివాదంపై టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తొలిసారి స్పందించారు. ఏ ఇంట్లో అయినా సోదరులు లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సహజమని చెప్పారు. తన కుటుంబంలో కూడా అదే మాదిరిగా విభేదాలు వచ్చాయని, ఇంటి గొడవను అంతర్గతంగా పరిష్కరించుకుంటామని అన్నారు. గతంలో తాను చాలామంది మధ్య విభేదాలను మధ్యవర్తిగా ఉండి పరిష్కరించానని గుర్తు చేసుకున్నారు.
మరోవైపు, జల్పల్లిలోని ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. విష్ణు, మనోజ్ ల బౌన్సర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు అడ్డుకుని బయటకు తోసివేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలోనే జల్ పల్లి ఫాం హౌస్ నుంచి మనోజ్, మౌనికలను బయటకు పంపించినట్లు తెలుస్తోంది. ఇంటి బయట ఒకచోట మనోజ్ కుర్చీ వేసుకొని కూర్చున్న వీడియో వైరల్ గా మారింది.
ఇక, ఫాం హౌస్ దగ్గర మరో చోట కుర్చీలో మోహన్ బాబు కూర్చొని ఉండగా..ఇద్దరు యువకులను బౌన్సర్లు కొడుతున్న వీడియో కూడా వైరల్ గా మారింది. ఇద్దరు యువకులు వీడియోలు తీశారన్న కారణంతో వారిని కొట్టి వారి ఫోన్లు లాక్కున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనను మేడపై నుంచి ఎవరో తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ అయింది.
మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడుతుండగా మంచు విష్ణు బయటకు వచ్చి మనోజ్ బౌన్సర్లును బయటకి తోసేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు మనోజ్ దంపతులు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి జల్పల్లి ఫాంహౌస్‌కు వెళ్లిన తర్వాతే మనోజ్, మౌనికలను మోహన్ బాబు ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారని తెలుస్తోంది. విష్ణు వచ్చాకే గొడవ మరింత పెద్దదయిందని తెలుస్తోంది.