అనకాపల్లి ప్రజాగళం బహిరంగ సభలో సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఈ ముఖ్యమంత్రి కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చాడని, పట్టాదారు పాస్ బుక్ పై ఎవరి ఫోటో ఉండాలి అని జగన్ ను ప్రశ్నించారు. ఈ భూమి నీ తాత ఇచ్చిందా? మా తాతలు మాకు ఇచ్చారు దానిపై నీ ఫోటో ఏంటి అంటూ జగన్ ను నిలదీశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తాను తన పాస్ పుస్తకం పై సైకో జగన్ ఫోటో పెట్టుకోవాలా అంటూ మండిపడ్డారు.
అంతేకాకుండా ఆ పాస్ బుక్ పై జగన్ ఫోటోను చించి వేసి అక్కడే దానిని చంద్రబాబు తగలబెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చూశాక వైసీపీ నేతల కడుపు మండిపోతోందని, కడుపు రగిలిన ఉద్యోగులు వైసీపీని ఛీ కొట్టారని అన్నారు. వైసీపీ నేతలు డబ్బులు ఇస్తానన్నా ఉద్యోగులు వద్దన్నారని, వారంతా కూటమికి ఓట్లు వేశారని కొనియాడారు. 2019 ముందు జగన్ ఊరూరా తిరిగాడని, ఆ రోజున తాను తలచుకొని ఉంటే బయట తిరిగేవాడా అని ప్రశ్నించారు.
ఈ సారి ఎన్నికల్లో మనకు మోడీ గ్యారెంటీ ఉందని అన్నారు. తాను, పవన్ కళ్యాణ్ కలిసి మేనిఫెస్టోను తీసుకువచ్చామని అన్నారు. ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ కావాలని, దేశంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం కావాలని ఆకాంక్షించారు. 2004 నాటికి వికసిత భారత్ మోడీ లక్ష్యమని, వికసిత ఏపీ తన లక్ష్యమని అన్నారు. నాలుగున్నరేళ్లు ఎన్నో ఇబ్బందులు పెట్టినా, అవమానాలు చేసినా భరించామని, ప్రజలను కాపాడేందుకే నిద్రలేని రాత్రులు గడిపామని అన్నారు. తనను జైల్లో పెట్టిన తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా పొత్తు ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అదే ఆయన చిత్తశుద్ధి అని ప్రశంసించారు.
సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా రియల్ హీరో పవన్ అని కొనియాడారు. రాష్ట్రం గెలవడం కోసం ప్రజలు గెలవడం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని పవన్ అన్నారని, సినీ జీవితంలో ఇంతకన్నా ఎక్కువ గౌరవం వస్తున్నా ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చారని ప్రశంసించారు.