ఆయన ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు వీర విధేయుడు, నమ్మిన బంటు. పైగా జగన్ నా.. నా.. నా.. అని చెప్పుకొనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. కానీ, తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకు న్నారు. సీఎం జగన్‌ను తీవ్రస్థాయిలో ఎండగడుతున్న ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల గూటికి చేరుకున్నారు. ఆమె కూడా.. ఆయనను సాదరంగా స్వాగతించి.. వచ్చిందే చాలన్నట్టుగా కండువా కప్పేసి పార్టీ తీర్థం ఇచ్చేశారు.
ఆయనే.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం నందికొట్కూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్. వరుస విజయాలు ఆయన సొంతం. 2014, 2019 ఎన్నికల్లో నందికొట్కూరు నుంచివైసీపీ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. అయితే.. తొలి ఐదేళ్లు హుషారుగానే సాగిపోయినా.. తర్వాత.. ఈ నియోజక వర్గం ఇంచార్జ్‌గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చారు. ఇక, అప్పటి నుంచి ఆర్థర్‌కు అగచాట్లు ప్రారంభమయ్యారు. తన మాటకు విలువ లేకుండా పోయిందని అనేక సందర్భాల్లో ఆయన మొత్తుకున్నారు.
అనేక సార్లు ఇరువురి మధ్య పంచాయితీ కూడా సాగింది. ఇక, తాజా ఎన్నికల్లో బైరెడ్డి మాటే నెగ్గింది. ఈ క్రమంలో ఆర్ధర్‌కు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. బైరెడ్డి సూచించిన డాక్టర్ సుధీర్‌కు టికెట్ ఇచ్చారు. దీంతో ఆర్థర్ చాలా రోజులు వేచి చూశారు. అయితే.. సీఎం జగన్‌ను ఆయన ప్రేమించినా.. ఆయన పట్ల జగన్‌కు ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీంతో ఆర్థర్.. టీడీపీవైపు మొగ్గు చూపారు. కానీ, అక్కడ కూడా జనాలుఎక్కువగా ఉన్నారు.
దీంతో షర్మిల నుంచి సమాచారం అందుకున్న ఆర్థర్.. తాజాగా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఆయనకు షర్మిల సాదర స్వాగతం పలికి.. పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు నందికొట్కూరు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. గతంలోనూ కాంగ్రెస్ పార్టీలో ఆర్థర్ పనిచేశారు. వైఎస్‌కు చేరువయ్యారు. ఇదిఇప్పుడు ఆయనకు కలిసి రానుంది. అయితే.. ఆయన గెలిచినా గెలవకపోయినా.. ఓటు బ్యాంకు మాత్రం చీలడం ఖాయమని తెలుస్తోంది