వైసీపీ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఆయన కావాలని అంటారో..కాకతాళీయంగా అంటారో తెలియదుగానీ కొంతకాలంగా ధర్మాన చేస్తున్న వ్యాఖ్యలు అధికార పార్టీని ఇరుకున పడేసేలా ఉంటున్నాయి. అయినా సరే తనదైన శైలిలో ధర్మాన మాత్రం తగ్గేదేలే అన్న రీతిలో తనకు తోచింది నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడేస్తున్నారు. ఎవడో సుబ్బారెడ్డి అంట ఉత్తరాంధ్ర భూములను కాజేయడానికి వస్తే తంతా అని చెప్పి పంపించాను అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఆ వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే తాజాగా మరోసారి ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి ప్రమేయం లేకుండా మహిళల ఖాతాలలో పథకాల సొమ్ము పడుతుంటే సమావేశాలలో వారు ఎందుకు కూర్చుంటారని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కుటుంబాలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ధర్మాన వైయస్సార్ చేయూత చెక్కులు పంపిణీ చేశారు. అయితే ధర్మాన మాట్లాడుతున్న సమయంలో మహిళలు ఒక్కొక్కరిగా లేచి వెళ్లిపోయారు. ఓ పక్క వాలంటీర్లు గేట్లు మూసివేసి కాపలా కాసినా..మరో పక్క వేరే గేట్ నుంచి వారు వెళ్లిపోయారు. ఇది చూసిన ధర్మాన అసహనానికి గురయ్యారు.
మహిళలు అలా వెళ్ళిపోతారని తనకు తెలుసని, అందుకే తాను రావడానికి కాసేపు ముందు మాత్రమే వారిని తీసుకురమ్మని చెబుతుంటానని అన్నారు. తనకంటే ముందు మహిళలు వస్తే జరిగేది ఇదేనని ఉన్నమాట చెప్పేశారు ధర్మాన. తమకు కులమత పార్టీ భేదాలు లేవని, ఒంటిపై పసుపు చొక్కా ఉన్నా, తమకు ఓటు వేయకపోయినా వారి కన్నీరు తుడుస్తామని అన్నారు. ఇక, పథకాల ద్వారా లబ్ధి పొంది ప్రభుత్వానికి విధేయులుగా ఉండని వారు పనికిమాలిన వారని, వారి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ వెళ్లిపోయిన మహిళలను ఉద్దేశించి ధర్మాన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
అన్ని పథకాల ద్వారా లబ్ధి పొంది అడ్డదిడ్డంగా మాట్లాడే వారిని వదిలేయాలంటూ ధర్మాన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి హోదాలో ఉండి మహిళలపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.