జగన్ తన ఐదేళ్ల పాలనలో ఓ చెత్త రికార్డు ఆయన సొంతం చేసుకున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రజల్లోకి వచ్చేందుకు.. ప్రజల మధ్యే ఉండేందుకు.. వారి మధ్యే నిద్రించేందుకు ప్లాన్ చేసుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ఐదేళ్ల కాలంలో జగన్ వ్యవహరించిన తీరును చాలా మంది తప్పు బడుతున్నారు. కనీసం.. ప్రజలను పలకరించేందుకు మూడున్నర సంవత్సరాలు ఆయన బయటకు కూడా రాలేదని ఆరోపించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇక, మీడియాతో ఆయన కేవలం ఒకే ఒక్క సందర్భంలో మాట్లాడారు. అది కూడా.. స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కారణఃంగా అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బాబు వాయిదా వేశారు. దీనిని ఖండిస్తూ.. సీఎం జగన్ వెనువెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే.. ఈ సందర్భంగా నిమ్మగడ్డకు కులాన్ని ఆపాదించి.. ఆరోపణలు చేసి.. మైకు కట్టేశారు తప్ప.. మీడియా ప్రతినిధులను ఏమైనా అడగమని కానీ.. వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కానీ.. జగన్ భావించలేదు. మొత్తంగా చూస్తే ఐదేళ్ల కాలం అయిపోయింది. కానీ, ఏ సీఎం కూడా.. ఇలా మీడియాతో వ్యవహరించలేదు.
ఈ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ బాటలో సీఎం జగన్ పయనిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే.. మోడీ కూడా.. కేవలం పార్లమెంటు సమావేశాల ప్రారంభం సమయంలో మాత్రమే మీడియా ముందుకు వచ్చి.. అందరూ సహకరించాలని చెప్పి వెళ్లిపోతుంటారు. తప్ప.. మీడియా అడిగే ప్రశ్నలకు ఆయన ఎప్పుడూ సమాధానాలు చెప్పలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఒక్కటంటే ఒక్క ప్రశ్నను ఎదుర్కోకుండానే తన పదవీ కాలాన్ని పూర్తి చేయటం ఒక రికార్డుగా అభివర్ణిస్తున్నారు.
సాధారణంగా ముఖ్యమంత్రులుగా పదవీబాధ్యతలు చేపట్టే అధినాయకులు ఎవరైనా సరే.. ప్రభుత్వ విధానాలతో పాటు.. తమ పొలిటికల్ స్టాండ్ ను వివరించేందుకు.. ప్రజల్లో చేరేందుకు వీలుగా మీడియా భేటీల్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి తీరుకు జగన్మోహన్ రెడ్డి కాస్త భిన్నం. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది 2019లో అయినా.. ప్రభుత్వంలో కాస్త కుదురుకొని పాలన వైపు ఫోకస్ చేసే సమయానికి కొవిడ్ వచ్చి పడటం.. లాక్ డౌన్ లాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. కొవిడ్ టైంలో ఒకే ఒక్కసారి మీడియా ముందు వచ్చి తాను చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పేసి వెళ్లిపోయారు.