ఘట్టమనేని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్ బాబు (56) కన్నుమూశారు.
కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయనకు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.
గడిచిన కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో రమేశ్ బాబు బాధ పడుతున్నారు.
ఆదివారం ఉదయం ఆయన భౌతిక కాయం ఇంటికి తీసుకెళ్లనున్నట్లు చెబుతున్నారు.
ఒకవైపు కృష్ణ చిన్న కుమారుడు మహేశ్ బాబు కరోనా కారణంగా ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. పెద్ద కుమారుడు అనారోగ్యంతో కన్నుమూసిన వైనం కలిచివేస్తోంది.
కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు 1965 అక్టోబరు 13న జన్మించిన రమేశ్ బాబు.. 1974లో అల్లూరి సీతారామరజు చిత్రంలో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు.
ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో బాల నటుడిగా నటించారు. దాదాపు పదిహేను సినిమాల్లో నటించారు.
సామ్రాట్ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఆయన ఎంట్రీ ఇచ్చారు. అయితే.. ఆ చిత్రం ఆయన్ను నిరాశ పరిచింది.
ఆ తర్వాత బజారురౌడీతో తొలిసారి బ్లాక్ బస్టర్ అందుకున్న రమేశ్ బాబు.. కలియుగ కర్ణుడు.. చిన్నిక్రష్ణుడు.. ముగ్గురు కొడుకులు.. బ్లాక్ టైగర్.. కృష్ణగారి అబ్బాయి తదితర సినిమాల్లో నటించారు.
తన తండ్రి కృష్ణతో కలిసి ఎన్ కౌంటర్ సినిమాలోచివరిగా నటించిన రమేశ్ బాబు.. ఆ తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. తిరిగి 2004లో నిర్మాతగా మారారు.
సూర్యవంశం హిందీ మూవీని నిర్మించిన ఆయన.. అర్జున్.. అతిథి సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత మహేశ్ బాబు నటించిన దూకుడు మూవీకి సమర్పకుడిగా వ్యవహరించారు.
ఇటీవల కాలంలో ఆయన వ్యాపారాలు చూసుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇక.. రమేశ్ బాబు మరణ వార్తపై ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించటం లేదు. వారంతా తీవ్రమైన షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
మహేశ్ బాబు కరోనా కారణంగా బయటకు రాలేని పరిస్థితి. మరోవైపు.. క్రిష్ణ పెద్ద వయస్కుడు కావటం.. మిగిలినకుటుంబ సభ్యులు తీవ్రమైన షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది.