అమరావతి మహా పాదయాత్ర- డైరీ – 12వ రోజు
ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో శాస్త్రోక్తంగా జరిగిన పూజ తర్వాత మహా పాదయాత్ర ముక్తినూతలపాడు లోని బస నుండి మొదలైంది.
మంగమ్మ కాలేజ్ సెంటర్, కర్నూల్ రోడ్డు బైపాస్ జంక్షన్, ఆర్టీసీ డిపో, అద్దంకి బస్టాండ్, మస్తాన్ దర్గా, కొత్తపట్నం బస్టాండ్ మీదుగా బచ్చల బాలయ్య కళ్యాణ మండపం చేరి… మధ్యాహ్న భోజనానికి విరామం తీసుకోవడం జరిగింది.
భోజన విరామం అనంతరం…. ప్రకాశం జిల్లా కలెక్టరేట్, భాగ్యనగర్ నాల్గవ లైన్ నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, QIS ఇంజనీరింగ్ కాలేజ్, వెంగ ముక్క పాలెం మీదుగా ఎరజర్ల చేరటం జరిగింది.
ఈ రోజు పాదయాత్ర దాదాపు 19 కిలోమీటర్లు కొనసాగింది.
మహా పాదయాత్ర ప్రారంభం నుండి కొనసాగుతున్న పోలీసు నిర్బంధం ఈ రోజు కూడా అడుగడుగునా కనిపించింది.
ముక్తినూతలపాడు నుండి ప్రారంభమైన మహా పాదయాత్ర… కొద్దిదూరం వెళ్ళే సమయానికే, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో వందలాది మంది పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
అయితే… నిన్న చదలవాడ లో జరిగిన పోలీసుల లాఠీఛార్జి తర్వాత, జనం పోలీసుల పై తిరగబడ్డ తీరు, పోలీసులు లో కొంత మార్పు తీసుకువచ్చింది. ఫలితంగా ఈరోజు నిన్నటి స్థాయిలో ఇబ్బందులు సృష్టించలేదు.
ఈరోజు మహా పాదయాత్ర లో కూడా వేలాది మంది పాల్గొని అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని గా కొనసాగించాలనే డిమాండ్ కు సంఘీభావం ప్రకటించారు.
ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్దలు నన్ను వ్యక్తిగతంగా కలిసి అమరావతి కి మద్దతు ప్రకటించడం జరిగింది.
ఒంగోలు నగరంలో ప్రధాన వీధిలో మహా పాదయాత్ర జరుగుతున్న సమయంలో, ఒక మిత్రుడు నన్ను పక్కనే ఉన్న హోటల్ కి టీ తాగడానికి తీసుకెళ్లడం జరిగింది. అప్పటికే మాస్కు పెట్టుకొని, అక్కడ ఎదురు చూస్తున్న ఒక అధికార పార్టీ జెడ్పిటిసి సభ్యుని పరిచయం చేసి, అమరావతి సంఘీభావం ప్రకటించడం జరిగింది.
మరో సందర్భంలో, రెండు వాహనాల మధ్యన నడుస్తున్నప్పుడు… ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, నా చేతిని తన చేతిలోకి తీసుకుని… సార్ మీరు బాగా పని చేస్తున్నారు… వెల్ డన్… మరో రెండు సంవత్సరాలు ఇలానే పని చేయండి, మీ లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పినప్పుడు… మారుతున్న ప్రజల ఆలోచన విధానం అర్థమైంది.
ఒంగోలు నగరంలో, కమ్మ పాలెం లో, ఎనిమిదవ డివిజన్ నుండి కార్పొరేటర్ గా ఎన్నికైన, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సండ్రపాటి వర్డ్స్ వర్త్ తన మిత్ర బృందంతో స్వాగతం పలికడం…అమరావతి మీద కమ్మ ముద్రవేసిన వారందరికీ… సరైన సమాధానం అని నాకనిపించింది.
ఒంగోలు నగరంలో ప్రతి వీధిలోనూ, మహా పాదయాత్ర సాగిన శివారు గ్రామాలలోనూ…. మహిళలు పెద్ద సంఖ్యలో నిలబడి, మహా పాదయాత్రకు నీరాజనాలు పట్టడం మీడియాలో ప్రత్యక్షంగా చూడవచ్చు.
ఈరోజు మధ్యాహ్నం భోజన విరామం ఈ సమయంలో, నిన్న పోలీసులు లాఠీఛార్జి లో గాయపడిన ఆళ్ల నాగార్జునను, మంగమూరు రోడ్డు లో వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. చెయ్యి విరిగిన కూడా బాధపడకుండా, మహా పాదయాత్ర లో కొన్ని రోజుల పాటు పాల్గొన్న లేకపోవడానికి అతను బాధపడటం చూస్తే, అమరావతి కోసం అతని తపన అర్థమవుతుంది.
ఈరోజు మహా పాదయాత్ర ప్రారంభం నుండి ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు తన వేలాది మంది అనుచరులతో మహా పాదయాత్ర జన జాతర గా నడిపించారు.
కొండేపి శాసనసభ్యులు బాల వీరాంజనేయ స్వామి గారు, మార్కాపురం మాజీ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు, పర్చూరు, అద్దంకి శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, మరెంతో మంది వివిధ పదవులు నిర్వహించిన, నిర్వహిస్తున్న నాయకులు ముందుండి ఈరోజు మహా పాదయాత్రను దిగ్విజయం చేశారు.
ఒంగోలు నగర వీధుల్లో వెళుతున్నప్పుడు… ఒక బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్న వ్యక్తి నా దగ్గరకు వచ్చి, మీరు టీవీ లో మాట్లాడే ప్రతి విషయం వింటాను… దయచేసి రాష్ట్రం మొత్తం తిరిగి, యువతను, విద్యార్థులను చైతన్య పరచండి… అని నాకు చెప్పినప్పుడు… సాధారణంగా కనిపించే వ్యక్తుల్లో ఉండే… అసాధారణ సామాజిక స్పృహ అర్థమైంది. ఈ రాష్ట్రం పట్ల అతనికున్న ప్రేమ అర్థమై, నేనే అతనితో ఒక ఫోటో తీసుకున్నాను.
ఈ రోజు పాదయాత్ర మొదలైన కాసేపటికే… జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు… గత 13 ఏళ్లుగా నా మిత్రుడు, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు షేక్ రియాజ్ వందలాది మంది జనసేన కార్యకర్తలతో పాదయాత్ర లో చేరటం, చాలా సంతోషాన్నిచ్చింది.
నెల్లూరు జిల్లాలో పాదయాత్ర లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే అవకాశం ఉందని రియాజ్ ప్రకటించినప్పుడు ఇంకా సంతోషం వేసింది.
ఒక కూడలి లో పాదయాత్ర ఆగినప్పుడు… నలుగురు దివ్యాంగులు, వారి ట్రై సైకిళ్ళ మీదే పాదయాత్రను అనుసరించడం చూసి, దగ్గరికి వెళ్ళాను. అందులో సాయి అనే వ్యక్తి… సార్ నేను సాయిని… అంటూ పెద్దగా కేకేశాడు. దగ్గరికి వెళ్లి చూస్తే… 15 ఏళ్ల క్రితం వచ్చిన విద్యార్థి. చాలా అద్భుతమైన అనుభూతి కలిగింది.
ఈరోజు సాయంత్రం మహా పాదయాత్ర లో భాగంగా వెంగ ముక్క పాలెం లో మహిళలతో జగన్ పాలన గురించి మాట్లాడినప్పుడు… వారిలో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమయింది. ఈసారి ఓటుకి లక్ష రూపాయలు ఇచ్చినా… జగన్ కు ఓటేయ్యం అని వాళ్ళు చెప్పిన విధానం చూస్తే… జగన్ onetime సీఎం అని అర్థమైంది.
ఈరోజు మహా పాదయాత్ర లో మరో అద్భుతమైన అనుభూతి… చీరాల కు చెందిన మిత్రుడు, ప్రగతిశీల భావాలున్న నాగార్జున ను కలవటం.
అభివృద్ధి చెందిన వాళ్ల కోసం కాదు… నువ్వు పోరాటం చేయవలసింది వెనుకబడిన వాళ్లకోసం, అని చాలా సేపు నాతో వాదించాడు. ఆ తర్వాత జై భీమ్ సినిమా గురించి మాట్లాడుకున్నాం. దళిత సంఘాలు, దళిత నాయకులు దళారులుగా మారి, దళిత ఉద్యమాలను ఎలా నిర్వీర్యం చేశారో… కాసేపు మాట్లాడుకున్నాం.
జై భీమ్ చూస్తున్నంతసేపు… ఎన్నిసార్లు ఏడ్చింది, లెక్కేసుకున్నాం.
జై భీమ్ గురించి మాట్లాడుకోవడం వల్ల…..
ఈరోజు బాల గోపాల్ గారు చాలా సార్లు గుర్తొచ్చారు.
కొలికపూడి శ్రీనివాసరావు.