అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జగన్ మూడు ముక్కలాట మళ్లీ మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిపై కోర్టు తీర్పును తప్పుబట్టిన జగన్…చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకే ఉందని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్, మంత్రులు కోర్టులపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తప్పుపట్టారు. వైసీపీకి 3 రాజధానులు కావాలనుకుంటే 175 నియోజకవర్గాలను 175 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఏపీ మంత్రివర్గంలో 90 శాతం మంది పదో తరగతి ఫెయిల్ అయిన వారున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
కేవలం మూడు రాజధానులను ఉద్దేశించి మాత్రమే చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు చెప్పిందని లోకేశ్ స్పష్టం చేశారు. మూడేళ్ల పాలనలో జగన్ ఒక్క కంపెనీని ఏపీకి తేలేదని, జిల్లాలు విభజిస్తే అభివృద్ధి జరుగుతుందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు, ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త జిల్లాలను తెరపైకి తెచ్చారని విమర్శించారు. కొత్త జిల్లాల వల్ల ఉపయోగం లేదని, ఒక్క ఉద్యోగం కూడా రాదని అన్నారు.
అంతకుముందు, శాసనమండలి నుంచి 8 మంది టీడీపీ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారు. ‘మద్య నిషేధంపై మహిళలకు జగన్ ఇచ్చిన హామీలు గోవిందా గోవిందా’ అని టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెం ఘటనపై చర్చకు వారు పట్టుబట్టారు. విజిల్స్ వేస్తూ, చిడతలు వాయిస్తూ టీడీపీ సభ్యులు మండలిలో నిరసన తెలిపారు. కల్తీ సారా మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
దీంతో, 8 మంది టీడీపీ సభ్యులను మండలి ఛైర్మన్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కేఈ ప్రభాకర్, మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అంగర రామ్మోహన్ రావు, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, దువ్వాడ రామారావు, బచ్చుల అర్జునుడు, రాజ నర్సింహులు ఉన్నారు. సభ ప్రారంభం కావడానికి ముందు జంగారెడ్డిగూడెం ఘటనపై, 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు మండలి వరకు ర్యాలీ చేశారు. మృతుల ఫొటోలకు నివాళులు అర్పిస్తూ నల్ల కండువాలతో నిరసన చేపట్టారు.