ప్రభుత్వ, అటవీ, బంజరు, చెరువు, ఈనాం….భూమి ఏదైనా సరే కబ్జా మాత్రం కామన్. ఎకరాల కొద్దీ పొలాలు, వందల సెంట్ల కమర్షియల్ ప్లాట్లు స్వాధీనం చేసుకుని భూ బకాసురులుగా మారుతున్నారు. ఇదేం అన్యాయం అని ఎవరైనా ఎదురు తిగిగితే…ఇచ్చిన పదో పరకో తీసుకొని స్థలం రాసిచ్చి ఖాళీచేయాలంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. మాట వినని వారిపై రౌడీమూకలు, పోలీసులను రంగంలోకి దింపి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఆ రెండూ కుదరకపోతే రెెవెన్యూ శాఖలో లొసుగులు, అధికారం ఉపయోగించి కొత్త రికార్డులను సృష్టించి అసలు స్థలం ఓనర్లను కోర్టులపాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ విమర్శలకు తగ్గట్లుగానే ఏకంగా విశాఖ ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు స్థలాన్ని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ కబ్జా చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఎంవీవీకి చెందిన ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ వేస్తున్న వెంచర్ కోసం రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే, దానికి పక్కనే ఉన్న ఎస్పీ మధుకు చెందిన స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన స్థలంలో ఎంవీవీ వెంచర్ కోసం రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారని ఆరోపించారు. అది గమనించి తన స్థలంలో కాంపాండ్‌వాల్ నిర్మిస్తుండగా అడ్డుకున్నారని ఆరోపించారు. తన పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఎస్పీ మధు ప్రశ్నించారు. అయితే, ఆ ఆరోపణలను ఎంవీవీ సత్యన్నారాయణ ఖండించారు. మధు అర్థరాత్రి అక్కడ గోడ నిర్మిస్తుండటంతో స్థానికులు సమాచారమిచ్చారని, వారి ఫిర్యాదుతో అనుమానం వచ్చి పనులు ఆపేశామని చెప్పారు. రికార్డ్స్‌లో అది లే అవుట్ రోడ్‌గా చూపిస్తోందని, ఆ భూమి నిజంగానే ఎస్పీ సొంతమైతే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు.