బీజేపీ కీలక నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి, బీఆర్ ఎస్ నేత కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి వసులు చేస్తున్న పన్నులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్రం పెట్టుబడులు పెడుతోందని అన్నారు. ఇది కాదని నిరూపిస్తే.. తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందు కు రెడీగా ఉన్నానని కేటీఆర్ సవాల్ రువ్వారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలతో తెలంగాణ భవిష్యత్‌ను తీర్చిదిద్దే పథకాలపై పెట్టుబడి పెట్టిందని కేటీఆర్ అన్నారు. ఏ ప్రధాని హయాంలో చేయని విధంగా మోడీ అప్పులు చేశారని దుయ్యబట్టారు. పోనీ.. ఇన్ని అప్పులు చేసినా ఒక్క మంచి పనైనా చెప్పగలిగారా? అని నిలదీశారు.
కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారని.. కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, హుజూర్‌నగర్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు.
రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. కేం ద్రం ఇచ్చిన నిధులను తెలంగాణ పాలకులు పక్కదారి పట్టించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ నిధులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారని, ఇది తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో భవిష్యత్ తరాల కోసం పెట్టుబడులు పెడుతోందని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు.