మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల అధికారులకు రాజగోపాల్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ ఇపుడు కొత్త చర్చకు తెరతీసింది. నామినేషన్లో భాగంగా తన ఆస్తుల వివరాలను రాజగోపాల్ రెడ్డి వెల్లడించడం ప్రతిపక్షాలకు అస్త్రాన్ని అందించింది. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.222.67 కోట్లు అని రాజగోపాల్ రెడ్డి పేర్కొనడంతో ప్రతిపక్ష నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
బీజేపీలో చేరేందుకు ముందు దాదాపు 18వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులను క్విడ్ ప్రోకో రూపంలో రాజగోపాల్ రెడ్డి దక్కించుకున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాదు, రాజగోపాల్ రెడ్డి ఆస్తులెంతో వెల్లడించాలంటూ విపక్ష పార్టీల నేతలు చాలాకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి ఆస్తుల విలువ రెండు వందల ఇరవై కోట్లు అని చూపడంతో రాజకీయ దుమారం రేగింది.
స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లు, చరాస్తుల విలువ రూ.69.97 కోట్లు, రూ.61.5 కోట్లు అప్పులు, తన భార్య పేరుపై రూ.52.44 కోట్ల ఆస్తులు ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. దీంతో, వెల్లడించిన ఆస్తులే ఇన్ని ఉన్నాయని, వెల్లడించనివి వేల కోట్లలో ఉంటాయని విమర్శలు గుప్పిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.
అయితే, తనపై వస్తున్న ఆరోపణలపై రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ స్పందించారు. తాను కాంట్రాక్టు పొందినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. అయితే, కోమటిరెడ్డి బ్రదర్స్ కు పలు కాంట్రాక్ట్ కంపెనీలున్నాయి. ఎప్పటినుంచో కోమటిరెడ్డి ఫ్యామిలీ కాంట్రాక్ట్ రంగంలో ఉంది. తమ కంపెనీల ద్వారా దేశ, విదేశాల్లో కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు కోమటిరెడ్డి బ్రదర్స్.