మంత్రి కొడాలి నానికి చెందిన గుడివాడలోని కె-కన్వెన్షన్‌లో క్యాసినో నిర్వహించినట్లు పలు వీడియోలు, రుజువుల ద్వారా మంత్రి కొడాలి నానిని కార్నర్ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించడం తెలిసిందే. ఈ ముప్పేట దాడితో నాని ఆవేశానికి లోనై టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడు గురించి పచ్చిబూతులు రెచ్చిపోయి మాట్లాడాడు. చంద్రబాబు ఇంట్లో ఎవరైనా వ్యభిచారం జరుగుతోందని ఆరోపిస్తే, నిరూపించడానికి ఆయన అనుమతిస్తాడా అంటూ నోటికొచ్చినట్లు వాగాడు.
గుడివాడను జూద రాజధానిగా మార్చిన నాని విపక్షాలు డిమాండ్ చేస్తే ఎందుకు రాజీనామా చేయాలని నాని అరిచారు. తన ఆధీనంలో క్యాసినో నిర్వహించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుని ఆత్మహత్యకు పాల్పడతానని ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు నాని. ఈ సవాల్ స్వీకరించిన ప్రతిపక్షాలు దానికి ఆధారాలు ఇచ్చాయి. దీంతో రాజీనామా చేయాలనే డిమాండ్ పెరగడంతో తట్టుకోలేకపోయాడు నాని. ఇష్యూను డైవర్ట్ చేయడానికి నాని చంద్రబాబును తిట్టడం మొదలుపెట్టాడు.
జనసేన, టీడీపీలు నానిని కార్నర్ చేశాయి. జగన్ ఆంతరంగిక మిత్రులు అయిన బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంలో సైలెంటుగా ఉన్నారు. జనసేన టీడీపీలు మాత్రం పెట్రోల్ టిన్లతో, కెసినో ఆధారాలతో విలేకరుల సమావేశాలు కూడా నిర్వహించాయి.
కె-కన్వెన్షన్‌లో జరిగిన ఘటనలపై నానిని నిలదీయడంతో ఆయన ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను పెద్దగా పట్టించుకోకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా? కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించినట్లు ఎవరైనా నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటానని చెప్పాడు. ఈ సవాల్‌ను ఎంచుకొని ప్రతిపక్షాలన్నీ ఆధారాలు సేకరించాయి. ఇదిగో పెట్రోలు రెడీ అంటూ వారు ప్రెస్ మీట్లు పెట్టారు.
ఎపుడైతే ఆధారాలు దొరికాయో అపుడు నాని ప్లేటు తిరగేశాడు. సవాల్ లేదు గివాల్ లేదు అన్నట్లు ఇష్యూని ఇంకోరకంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆరోపణల నుంచి బయటపడే మార్గం కనిపించని నాని, లోకేష్ పై పదేళ్ల క్రితం ఫొటోలు చూపించి విమర్శలు చేశారు. తమ తప్పుడు పనులు కనుక మీడియా చూపిస్తే వాటిపై ఎల్లో మీడియా ముద్ర వేయడం వైసీపీకి అలవాటే. నాని మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నాడు.
వయసుకు, పదవికి, పెద్దరికానికి గౌరవం ఇవ్వకుండా చంద్రబాబును బూతులతో ప్రస్తావించడం గుడివాడలో వైసీపీకి ఎలాంటి ఇబ్బందిని కలిగిస్తుందో తెలియదు గాని వైసీపీ పట్ల రాష్ట్రంలో ఏహ్యభావం కలిగించిందని విశ్లేషకులు చెబుతున్నారు.