మెగా కుటుంబంలో కొణిదెల రాంచరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న కూతురు పుట్టిన విషయం తెలిసిందే. ఆమెకు ఆ దంపతులు ‘క్లింకారా’ అని పేరు పెట్టుకున్నారు. ఆ బిడ్డ అడుగుపెట్టిన వేళా విశేషం మెగా కుటుంబంలో అన్నీ శుభపరిణామాలే అని అంటున్నారు. ఆ మహాలక్ష్మి కడుపులో ఉన్నప్పటి నుండి వారికి కలిసిరావడం ప్రారంభమయిందని అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఆమెను లక్కీ స్టార్ గా అభివర్ణిస్తున్నారు.
క్లింకారా కడుపులో ఉన్నప్పుడే ‘ఆర్ఆర్ఆర్‘ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించిందని, ఆ తర్వాత ఆమె బాబాయ్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ప్రేమ పెళ్లి జరిగిందని అంటున్నారు. నవంబర్ 1 2023లో వీరి వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. ఇటీవలె చిరంజీవి దానిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఘన విజయం మరో ఎత్తు అని అభిమానులు చెబుతున్నారు. పోటీ చేసిన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలలో విజయం సాధించిందని, ఈ శుభ పరిణామాలు అన్నీ క్లింకారా అడుగుపెట్టిన తర్వాతనే సాధ్యమయ్యాయని అంటున్నారు.