ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న గన్నవరం మండలంలో కేశనపల్లిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సారి కూటమిలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూడా ఉన్నాయి. దీంతో మూడు పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో కేబినెట్ కూర్పు ఉండబోతోంది. కూటమి కేబినెట్ ఎలా ఉండబోతోంది ? ఎవరెవరు మంత్రులు అవుతారన్నది ఆసక్తిగా ఉంది.
ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో సీనియర్ నేతలు కూడా మంత్రి పదవులు రేసులో ఉన్నారు. ఈ క్రమంలోనే బీసీ మంత్రుల కూర్పులో సీనియర్లకు తప్పక అవకాశాలు రానున్నాయి. బీసీ – పద్మశాలీ , చేనేత ఉప కులాలకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు ఈ సారి ఖచ్చితంగా బెర్త్ వస్తుందన్న చర్చలు నడుస్తున్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికల్లో పద్మసాలీ, చేనేత ఉపకులాలకు ఇచ్చే సీట్ల విషయంలో టీడీపీలో సమీకరణలు కలిసి రాలేదు. చేనేతలు ఎక్కువుగా ఉండే చీరాలను యాదవ సామాజిక వర్గానికి కేటాయించగా… అదే చేనేత, పద్మశాలీలు ఎక్కువుగా ఉండే మంగళగిరి నుంచి పార్టీ యువనేత లోకేష్ స్వయంగా పోటీలో ఉన్నారు.
చేనేత కులం నుంచి టీడీపీ తరపున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేగా కందికుంట వెంకట ప్రసాద్ ఒక్కరే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేనేత, ఉప కులాలకు చెందిన ఓటర్ల చాలా ఎక్కువుగా ఉన్నారు. ఈ సారి ఈ కమ్యూనిటీకి కేబినెట్లో తప్పక ప్రధాన్యత కల్పించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. కందికుంట పార్టీలో సీనియర్ నేత… పైగా ముస్లిం ప్రాబల్యం ఎక్కువుగా ఉన్న కదిరి లాంటి నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా పార్టీని నాయకత్వం వహిస్తూ అక్కడ పార్టీని నడిపిస్తున్నారు. 2009 ఎన్నికల్లో కందికుంట 17 వేల ఓట్లతో కదిరి గడ్డపై టీడీపీ జెండా ఎగరవేశారు.
ఇక తాజా ఎన్నికల్లోనూ కందికుంట గెలిచి.. చేనేత సామాజిక వర్గ కులాల నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు సీనియర్‌గానూ ఉన్నారు. దీంతో ఈ కులాల నుంచి కేబినెట్ బెర్త్‌లో ఏకైక ఆప్షన్‌గా నిలిచారు. అందులోనూ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులాలకు ప్రాథినిత్యం కల్పించాలన్న బాబు ఆలోచన నేపథ్యంలో కందికుంటకు మంత్రి పదవి ఖాయం చేశారని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో కమ్మ + బీసీ కాంబినేషన్లో కేబినెట్ బెర్త్‌లు ఉండబోతున్నాయని కూడా లీకులు వచ్చేస్తున్నాయి.