సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, జగన్ పర్యటిస్తున్నారంటే షాపులు మూసివేయాల్సిన పరిస్థితి ఉందని షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ బందోబస్తులో 600 మంది పోలీసులు ఉంటున్నారని, దీనిని బట్టి జనానికి ప్రభుత్వం ఏ స్థాయిలో భయపడుతుందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.
చంద్రబాబును ముసలోడంటున్నారని, అయినా కూడా ఆయన ప్రజల్లో ధైర్యంగా నీరాజనాలందుకుంటూ తిరుగుతున్నాడని జేసీ గుర్తు చేశారు. అదే సమయంలో యువకుడని చెప్పుకుంటున్న జగన్ మాత్రం ప్రజల్లోకి రావాలంటే భయపడుతున్నారని సెటైర్లు వేశారు. ముసలోడైనా చంద్రబాబే మేలని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ అధినేతపై జేసీ ప్రశంసలు కురిపించారు.
‘గడప గడపకు మన ప్రభుత్వం’ అంటూ గ్రామ, వార్డు వాలంటీర్లను వెంటబెట్టుకొని వైసీపీ ఎమ్మెల్యేలు పల్లెలన్నీ తిరుగుతున్నారని, జగనన్నను మరోసారి దీవించాలని ప్రాధేయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక ఎంపీ అయితే ప్రజల పల్స్ పట్టుకోవాలి.. టీడీపీ వాళ్లను లాక్కురండి అని వాలంటీర్లతో చెప్తుండటాన్ని తాను గమనించానని వైసీపీ నేతల గుట్టురట్టు చేశారు. పోలీసులు లేనిదే ప్రజల్లో పర్యటించే పరిస్థితి లేదన్నారు.
పోలీసు అనే మహా వృక్షం కింద వైసీపీ ఉందని పోలీసులపై కూడా జేసీ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీపై సొంత కార్యకర్తల్లోనే చాలా ద్వేషం ఉందని జేసీ అన్నారు. టీడీపీ నేతలంతా ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలని, చంద్రబాబును మళ్లీ సీఎంను చేసుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబును సీఎం చేసేందుకు జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉండాలని జేసీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.