ఏపీలో జనంపై జగన్ విద్యుత్ ఛార్జీల బాదుడుతో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. గతంలో ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో సామాన్యుల నడ్డి విరగ్గొట్టాలని చూసిన జగన్…అది వర్కవుట్ కాకపోవడంతో ఏకంగా చార్జీలు పెంచేయడానికి సిద్ధమయ్యారు. కేటగిరీని బట్టి యూనిట్ కు 45 పైసల నుంచి రూ1.57 వరకు పెంచేందుకు ఈఆర్సీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ నుంచి పెంచిన విద్యుత్ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశాడు. అన్న వచ్చాడు, షాక్ ఇచ్చాడు అంటూ జగన్ పై జేసీ తనదైన మార్క్ సెటైర్ వేశారు. వైఎస్సార్ పేరును జగన్ సర్వనాశనం చేస్తున్నాడంటూ దుయ్యబట్టారు. జగన్ కు కాస్త జ్ఞానాన్ని ప్రసాదించు అంటూ భగవంతుణ్ని కూడా జేసీ వేడుకున్నారు. ప్రస్తుతం జగన్ పై జేసీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి…తాజాగా క్షతగాత్రులకు సాయం చేసి జనం మెప్పు పొందారు. తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్తున్న రోడ్డులో ప్రమాదవశాత్తు ఓ ఆటో బోల్తా పడి చాలా మంది గాయపడ్డారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న దివాకర్ రెడ్డి…ఆ క్షతగాత్రుల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ యువతిని తన కారులో ఎక్కించుకున్నారు.
అమెను హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి జేసీ దివాకర్‌రెడ్డి తరలించి చికిత్స చేయాలని డాక్టర్లకు సూచించారు. తీవ్ర గాయాలతో స్పృహ తప్పిన ఆ యువతిని ఐసీయూకు తరలించి డాక్టర్లు చికిత్స అందించారు. ఆ యువతి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని డాక్టర్లకు జేసీ సూచించారు. ఆ తర్వాత కాసేపటికే ఆ యువతి చికిత్స పొందుతూ మృతి చెందిందని జేసీకి సమాచారం అందడంతో ఆయన తీవ్ర ఆవేదన చెందారు.