జగన్ హయాంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి విశాఖకు విజయ సాయిరెడ్డి మకుటం లేని మహారాజులాగా యథేచ్ఛగా కబ్జాలు, భూ ఆక్రమణలకు పాల్పడ్డారని టీడీపీ, జనసేన నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా విజయ సాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ భారీ షాకిచ్చింది. విశాఖలో నేహా రెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు.
విశాఖకే తలమానికమైన భీమిలి బీచ్ వద్ద సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘించి మరీ ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టిన నేహారెడ్డిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆమెపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. బీచ్‌లో కాంక్రీట్ నిర్మాణాలకు అనుమతి లేదని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలోనే నేహా రెడ్డికి ఈ నెల 2న జీవీఎంసీ నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో, ఆ అక్రమ నిర్మాణాలను అధికారులు ఈ రోజు కూల్చేశారు.
ఈ క్రమంలోనే జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకృతితో ఆటలాడడం జగన్ కు, వైసీపీ నేతలకు కొత్త కాదని ట్రోలింగ్ జరుగుతోంది. జగన్ రెడ్డి ఇసుక మాఫియాకు అన్నమయ్య డ్యాం బలైందని, జగన్ అండ్ కో కబ్జా కోరల్లో చిక్కిన బుడమేరు విజయవాను ముంచేసిందని, ఈ రోజు విశాఖ సముద్ర తీరం కూడా కబ్జాకు గురైందని విమర్శిస్తున్నారు. సహజవనరులను సొంతానికి వాడుకున్న జగన్ రెడ్డి విశాఖ సముద్రం ఒడ్డును విజయసాయి రెడ్డి కూతురుకి రాసిచ్చారని కామెంట్లు వస్తున్నాయి. ఈ రకంగా రాష్ట్రం నలుమూలలా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా, పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా జగన్ రెడ్డి గ్యాంగ్ చేసిన పాపాలు రాష్ట్ర భవిష్యత్తు తరాలకు శాపాలుగా మారాయని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.