రాష్ట్రంలో చిత్రమైన పరిస్థితి నెలకొందని అంటున్నారు పరిశీలకులు. ఇన్నాళ్లుగా జగన్ పాలనను, ఆయన ఆలోచనను పొరుగు రాష్ట్రాలు పంచుకున్నాయి. అంతేకాదు.. ఇక్కడ పెట్టిన అనేక పథకాలను సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆయా రాష్ట్రాలు తీసుకున్నాయి.
దీంతో `మమ్మల్ని చూసి.. పొరుగు రాష్ట్రాలు నేర్చు కుంటున్నాయి. మా కన్నా ఉత్తమ పాలన ఎక్కడా లేదు! ` అని వైసీపీ నాయకులు, మంత్రులు, ఆఖరుకు సీఎం జగన్ కూడా ప్రచారం చేసుకున్నారు.
నిజమే. గడిచిన రెండేళ్లలో డబ్బుతో సంబంధం లేని కొన్ని పథకాలను, నిర్ణయాలను పొరుగు రాష్ట్రాలు జగన్ ను చూసి నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది.
ఇతర రాష్ట్రాలను చూసి.. వారు తీసుకున్న నిర్ణయాలను చూసి ..జగన్ ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదన తెరమీదికి వస్తోంది. ఇటు సాధారణ మీడియాలోను, అటు సోషల్ మీడియాలోనూ ఇదే తరహా.. ప్రచారం సాగుతుండడం గమనార్హం. ఇంతకీ విషయం ఏంటంటే.. కరోనా ఎఫెక్ట్!!
ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. రోజుకు సగటున 40 మంది చనిపోతున్నారు. అంతేకాదు, ఈ లెక్కన ప్రతి ముప్పావుగంటకు(45 నిముషాలు) ఒకరు చొప్పున చనిపోతున్నారని వైద్య వర్గాలు లెక్కలు గడుతున్నాయి.
అయినప్పటికీ.. జగన్ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. కరోనా విషయంలో ఇతర రాష్ట్రాలన్నీ నిర్ణయాలు తీసుకున్న తర్వాతే.. సీఎం జగన్ అడుగులు ముందుకు వేశారు. తెలంగాణలో స్కూళ్లకు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన తర్వాతే.. ఏపీలో ప్రకటించారు.
అదేవిధంగా కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడంలోను పొరుగున్న ఉన్న తమిళనాడు, ఒడిసా, తెలం గాణ రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేసిన తర్వాతే.. జగన్ స్పందించారు.ఇక, మరీ ముఖ్యంగా బహిరంగ ప్రాంతాల్లో జనసంచారంపై.. ఇతర రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించిన తర్వాతే.. తీరిగ్గా ఏపీలో జగన్ నైట్ కర్ఫ్యూ విధించారు.
అది కూడా.. నైట్ 10-5 వరకు విధించారు. ఇతర రాష్ట్రాల్లో .. ఇది 9-7గా ఉంది. కానీ, ఇక్కడ మాత్రం పూర్తిగా వెసులుబాట్లు కల్పించారు. ఇలా.. మొత్తంగా.. జగన్.. కరోనా విషయంలో ఇతర రాష్ట్రాలను చూసి నేర్చుకుంటున్నారనే కామెంట్లు వ్యక్తం అవుతుండడం గమనార్హం.