ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఏ పార్టీ అయినా సరే ఓటమిని హుందాగా స్వీకరించాలి. ఈ అపజయంపై సమీక్షలు నిర్వహించి, దీని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి. రాబోయే ఎన్నికలపై దృష్టి పెట్టాలి. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా ఈవీఎంలపై నెపం మోపుతున్నారు. ప్రజా వ్యతిరేకత కారణంగానే ఎన్నికల్లో దారుణ పరాభవం కలిగిందనే నిజాన్ని మాత్రం జగన్ ఒప్పుకోలేకపోతున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే ఎన్నికల్లో ఓడిపోయామని జగన్ అండ్ కో మొత్తుకుంటున్నారు. దీంతో ఎన్నికల్లో హోరంగా ఓడినా జగన్ తీరు ఏ మాత్రం మారడం లేదని ప్రజలు అనుకుంటున్నారు.
ఈవీఎంల ట్యాంపరింగ్‌పై చర్చ ఎప్పటినుంచో సాగుతోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇదే హాట్ టాపిక్‌గా మారుతోంది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో ఓడిపోయిన పార్టీలు తమ పరాజయాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ ఈవీఎంల టాపిక్‌ను ముందేసుకుంటున్నాయి. ఇప్పుడు ఏపీలో జగన్ పార్టీ కూడా అదే చేస్తోంది. ఈవీఎంలపై అనుమానాలున్నాయని, బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించడమే మేలు అనేలా జగన్ మాట్లాడుతున్నారు. కానీ అదే జగన్ 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది అసాధ్యమంటూ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు టీడీపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో గెలిచింది. అప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని, తమ పార్టీపై జనం ఆదరణతోనే ఈ విజయం దక్కిందని జగన్ అన్నారు. పోలింగ్ బూత్‌లో ఈవీఎంలో మనం ఏ పార్టీకి ఓటు వేస్తే వీవీ ప్యాట్‌లో అదే చూపిస్తోందని జగన్ చెప్పారు. ఫ్యాన్ గుర్తుకు వేస్తే వీవీ ప్యాట్‌లో సైకిల్ గుర్తు వస్తే ప్రజలే ప్రశ్నిస్తారని, అలాంటిదేమీ లేదు కాబట్టే సంతృప్తిగా ఉన్నారని అప్పుడు జగన్ పేర్కొన్నారు. అప్పుడు జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇప్పుడు టీడీపీ నేతలు ప్రస్తావిస్తూ వైసీపీని ప్రశ్నిస్తున్నారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు ఒకలా ఈవీఎంల గురించి మాట్లాడటం సరికాదని అంటున్నారు. ఇప్పటికైనా ప్రజల్లో ఎందుకంత వ్యతిరేకత వచ్చిందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తే మేలని జగన్‌కు హితబోధ చేస్తున్నారు.