ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార పార్టీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓ పక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర విజయవంతం కావడం, వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగంపై జనసేనాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో వైసీపీ అధిష్టానం ఇరకాటంలో పడింది. మూలిగే నక్క మీద తాటికాయ చందంగా తాజాగా రామచంద్రాపురం నియోజకర్గం వైసీపీలో ముసలం మొదలు కావడం జగన్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ప్రతిపక్షాల దాడికి స్వపక్షంలోని అంతర్గత కలహాల వేడి తోడవ్వడంతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.
రామచంద్రపురం వైసీపీలో ఇద్దరు కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరడంతో జగన్ ఇరకాటంలో పడ్డారు. జగన్ విధేయుడిగా పేరుగాంచిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నరీతిలో జరుగుతున్న మాటల యుద్ధం తాజాగా తాడేపల్లికి చేరింది. తన అనుచరుడు, మున్సిపల్ ఛైర్మన్ శివాజీపై మంత్రి అనుచరుడు దాడి చేశారని జగన్ కు ఫిర్యాదు చేశారు. జగన్ తో దాదాపు అరగంట పాటు భేటీ అయిన సుభాష్ చంద్రబోస్… నియోజకవర్గంలో మంత్రి కారణంగా తాను, తన వర్గీయులు ఇబ్బందిపడుతున్న వైనాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.
మరోవైపు, మంత్రి వేణుకు వ్యతిరేక వర్గం తయారైంది. ద్రాక్షారామంలో సుభాష్ చంద్రబోస్ వర్గం నేతలు భేటీ అయి..ఆయన తనయుడు సూర్య ప్రకాశ్ కు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలని, మంత్రి వేణుగోపాలకృష్ణకు ఇస్తే ఓడిస్తామని తీర్మానించుకున్నారు. మరి, ఈ పంచాయతీని జగన్ ఏవిధంగా సర్దుబాటు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇటువంటి గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం కలిగించడం ఖాయమని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.