వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు మంత్రి నారా లోకేష్ భారీ ఆఫర్ ఇచ్చారు. జగన్ కనుక ప్రజల మధ్య కు వస్తానంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. అదేవిధంగా ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా తమకు ఇబ్బంది లేదని చెప్పారు. జగన్ ప్రజల మధ్యకు వస్తానంటే ప్రభుత్వం తరఫున అనుమతులు తానే స్వయంగా ఇప్పిస్తానని నారా లోకేష్ చెప్పారు. అయితే.. జగన్ ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఆయన హయాంలో జరిగిన అకృత్యాలపై ప్రజలు ఇప్పటికీ తిట్టుకుంటున్నారని చెప్పారు.
“ఎక్కడికి వెళ్లినా.. జగన్ బాధితులే కనిపిస్తున్నారు. జగన్‌ను వదిలించుకున్నందుకు సంతోషిస్తున్నారు. ఆయనను, ఆయన ఫొటోను కూడా చూసేందుకు ప్రజలు ఇష్టపడడం లేదు. అందుకే ప్రజల మధ్యకు వచ్చేందుకు జగన్ భయపడుతున్నాడు. ఒకవేళ ప్రజల మధ్యకు వస్తానని బయటకు వస్తే.. నేనే స్వయంగా ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పిస్తా“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అయితే.. ఇలా అనుమతులు ఇచ్చాం కదా.. అని తిక్కవేషాలు వేస్తే.. కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు.
ఇక, రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ.. “రెడ్ బుక్ పేరు చెబితేనే వైసీపీ నాయకులకు తడిచిపోతోంది. కలలో కూడా రెడ్ బుక్కే వారికి గుర్తుకు వస్తున్నట్టుంది“ అని నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో రెడ్‌బుక్‌లో కొందరి పేర్లు రాశామని, తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ జాబితాలో భూకబ్జాలు చేసిన పెద్దరెడ్ల పేర్లు కూడా ఉన్నాయని చెప్పారు. చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకుని ప్రజలను వేధించిన వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు.
కూటమి సర్కారుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. నకిలీ ప్రచారం చేస్తూ.. నకిలీ ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. వరదలు సహా అన్ని విషయాల్లోనూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. నకిలీ ప్రచారం చేసేవారిని త్వరలోనే జైలుకు పంపిస్తామని లోకేష్ హెచ్చరించారు.