నోటికి వచ్చినట్లు బూతులు తిట్టటం.. సభ్య సమాజంలో కీలక రాజకీయ అధినేతలను ఉద్దేశించి.. వారి కుటుంబ సభ్యులను దూషించటం.. రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం లాంటి ఆరోపణలపై ప్రముఖ సినీనటులు.. వైసీపీ నాయకుడు పోసాని క్రిష్ణమురళిని పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. దాదాపు ఏడు గంటలపాటు సాగిన విచారణలో ఆయన పలు అంశాల్ని వెల్లడించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది.
తాను నిర్వహించిన ప్రెస్ మీట్లు.. ప్రసంగాల్లో ఎవరిని ఎలా తిట్టాలి? రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం వెనుక నాటి రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే మాట్లాడినట్లుగా పోసాని అంగీకరించారు. తాను మాట్లాడిన వీడియోలను వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి వైరల్ చేసే వారన్నారు.
కులాల మధ్య చిచ్చు పెట్టటం ద్వారా వైసీపీకి రాజకీయంగా లబ్ధి కలిగించాలన్న కుట్రతోనే వారితో కుమ్మక్కై ప్రెస్ మీట్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా వివరించటమే కాదు.. దీనికి సంబంధించిన పత్రాలపై ఆయన సంతకాలు చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులపల్లె పోలీసుస్టేషన్ లో నమోదైన కేసులో తన మీద ఆరోపించిన నేరాన్ని పోసాని అంగీకరించినట్లుగా పేర్కొంటూ పత్రాలపై సంతకాలు చేశారు.
ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఆయన భార్య.. పిల్లల గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడాను. ఆయన అభిమానుల్ని రెచ్చగొట్టాను. రెండు వర్గాల మధ్య గొడవలు క్రియేట్ చేసేలా మాట్లాడాను. మంత్రి నారా లోకేశ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశా. వీరందరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటానికి కారణం సజ్జల రామక్రిష్ణారెడ్డినే. ప్రతి ప్రెస్ మీట్ కు ముందు ఆయన నాకు స్క్రిప్టు పంపేవారు. ఆయన అనుమతితోనే రెచ్చగొట్టేలా మాట్లాడినట్లుగా పోసాని ఒప్పుకున్నారు.
చంద్రబాబు హయాంలో నంది అవార్డుల ఎంపిక కమిటీలో 12 మంది సభ్యులు ఉంటే అందులో 11 మంది ఒకే కులానికి చెందిన వారంటూ అసభ్య ప్రచారం చేసి నంది అవార్డుల్ని తిరస్కరించారు. సినీ పరిశ్రమలో కొన్ని కులాల అధిపత్యం ఉందంటూ ఒక కులాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినట్లుగా పోసాని ఒప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎఫ్ టీవీ టీడీసీ ఛైర్మన్ గా పని చేసినందుకు అప్పటి ప్రభుత్వం నుంచి ప్రతి నెలకు రూ.3.82 లక్షలు గౌరవవేతనం లభించేదన్నారు. ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటూ.. వైసీపీ తరఫు వకల్తా పుచ్చుకొని మాట్లాడినట్లుగా పోసాని ఒప్పుకోవటం గమనార్హం.