టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీలో టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణపై కేసు నమోదు అయింది. ఆ తర్వాత ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు బెయిల్ మంజూరు కాగా ఆ నిర్ణయాన్ని చిత్తూరు జిల్లా సెషన్స్ కోర్టు రద్దు చేసింది. దీంతో, నారాయణకు బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో సవాల్ చేశారు.
మరోవైపు, నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో తాజాగా నారాయణకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. నారాయణ బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. నారాయణ తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదని సెషన్స్ కోర్టు చెప్పడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. అయితే, నారాయణను రిమాండ్ కు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ కు మాత్రం విచారణార్హత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
అంతేకాదు, నాలుగు వారాలలో ఆ రివ్యూ పిటిషన్ పై విచారణ జరపాలని ఆదేశించింది. అయితే, అప్పటివరకు పిటిషనర్ పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఏది ఏమైనా తాజా తీర్పుతో నారాయణ హైకోర్టులో భారీ ఊరట లభించినట్లయింది.