స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ లపై విచారణ మూడో రోజు కూడా వాడి వేడిగా జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, సిఐడి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు తీర్పును సోమవారానికి రిజర్వ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం లోపు ఈ రెండు పిటిషన్లపై తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక, మూడో రోజు విచారణ సందర్భంగా నువ్వెంత అంటే నువ్వెంత అన్న రీతిలో పొన్నవోలు వర్సెస్ దూబే అన్న రీతిలో మాటల యుద్ధం జరిగిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా దూబే వాదనలకు రిప్లై ఇస్తానని పొన్నవోలు చెప్పడంతో దూబే ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఆల్రెడీ పొన్నవోలు వాదనలు వినిపించిన తర్వాతే తాను వాదిస్తున్నానని, మళ్లీ రిప్లై వాదనలు వినిపిస్తానని చెప్పడం ఏమిటని దూబే ఆగ్రహం వ్యక్తం చేశారు అని తెలుస్తోంది.
ఈ సందర్భంగా యు ఆర్ నథింగ్ బిఫోర్ మీ అంటూ నోరు పారేసుకున్న పొన్నవోలు కోర్టు హాల్ నుంచి వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, పొన్నవోలుకు దూబే దీటుగా జవాబిచ్చినట్టు తెలుస్తోంది. మీరు డబుల్ ఏజీ అంటూ పొన్నవోలుకు దూబే కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ కూడా సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.