తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయ వేడి రాజేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీజేపీ నేతల ఈటల రాజేందర్ గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తుండగా….అధికార టీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఇక, హుజురాబాద్ లో విజయం సాధించి తనను టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం సరైన నిర్ణయమేనని ప్రూవ్ చేసుకోవాలని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గట్ట ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే అక్కడ పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం నేపథ్యంలో నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి.
ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌పై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ లో దళితుల ఓట్లను చీల్చేందుకు బిజేపీ, కాంగ్రెస్‌లు చీకటి ఒప్పందం చేసుకున్నాయని హరీశ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీపై దేశంలో వ్యతిరేకత పెరిగిపోయిందని, మోడీ ఫోటో చూడగానే పెరిగిన డీజిల్, పెట్రోల్ , గ్యాస్ సిలిండర్ ధరలు గుర్తుకు వస్తాయని హరీశ్ ఎద్దేవా చేశారు. మోడీ ఫొటో చూసి జనం ఓట్లు వేయరన్న ఉద్దేశంతోనే ఈటల రాజేందర్ కొత్త తరహా ప్రచారానికి తెరతీశారని ఆరోపించారు.
ప్రధాని మోడీ ఫోటో, బీజేపీ జెండాలను దాచిపెట్టిన ఈటల…కేవలం తన ఫోటో, తన గుర్తును మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు. బీజేపీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని, మోడీ దగ్గర 1000 కోట్ల ప్యాకేజీని ఈటల తేగలరా అని హరీశ్ సవాల్ విసిరారు. ఈటల ఎత్తుగడలకు హుజూరాబాద్ ప్రజలు మోసపోరని దుయ్యబట్టారు. ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లాభమని, టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే హుజూరాబాద్ ప్రజలందరికీ ప్రయోజనమని చెప్పారు.
ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100 దాటిందని, బీజేపీకి ఓటేస్తే ఏడాది తిరిగే సరికి డీజిల్, పెట్రోల్ ధరలు రూ.200 దాటుతుందని, గ్యాస్ సిలిండర్ ధర రూ.1500 దాటుతుందని హరీశ్ జోస్యం చెప్పారు. మోడీ దయవల్ల భారత ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే అధ్వాన్నంగా మారిందని ఎద్దేవా చేశారు.
అందుకే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో బీజేపీని బండకేసి బాదారని, రేపు హుజూరాబాద్‌లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. మరి, హరీశ్ రావు వ్యాఖ్యలపై ఈటల ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.