తొందరలో జరగబోతున్న ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ నుండి టీడీపీ అభ్యర్ధిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీచేయబోతున్నట్లు సమాచారం. ఎన్ఆర్ఐ అయిన పెమ్మసాని చాలాకాలంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో యాక్టివ్ గా ఉంటున్నారు. చంద్రబాబునాయుడుకు బాగా దగ్గరని కూడా పార్టీవర్గాలు చెబుతున్నాయి. పోయిన ఎన్నికల్లోనే టీడీపీ తరపున నరసరావుపేట పార్లమెంటు అభ్యర్ధిగా పోటీచేయాలని ప్రయత్నించారు. టికెట్ దక్కినట్లే దక్కి చివరినిముషంలో రాయపాటి సాంబశివరావుకు ఖాయమైంది.
టికెట్ దక్కకపోయినా తన పరిధిలో సామాజిక సేవలో బీజేపీగానే ఉంటున్నారు. తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంకు చెందిన పెమ్మసాని ఆర్ధికంగా బాగా గట్టి స్ధితిలో ఉన్నారు. మొదటినుండి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీచేయటంపైనే డాక్టర్ ఎక్కువగా దృష్టిపెట్టారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు సీటు టికెట్ కు ప్రయత్నించుకుంటున్నారు. గుంటూరు లోక్ సభపరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను మంచినీటి సరఫరా పైన ఎక్కువగా దృష్టిపెట్టారు. ఏడు అసెంబ్లీ సగ్మెంట్లలోని గ్రామాల్లో వందలాది బోర్లు వేయించారు. బోర్లు పడని గ్రామాల్లో ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేయిస్తున్నారు.
ఏ రూపంలో జనాల్లో పెమ్మసాని ఉన్నా అంతిమ లక్ష్యం మాత్రం పార్లమెంటు టికెట్ తీసుకుని పోటీచేయటమే. రాబోయే ఎన్నికల్లో పోటీచేయకూడదని ప్రస్తుత ఎంపీ గల్లా జయదేవ్ నిర్ణయించుకోవటం పెమ్మసానికి కాస్త సానుకూలమైందనే చెప్పాలి. అందుకనే జయదేవ్ రీప్లేస్మెంట్ గా తనకు టికెట్ ఇవ్వమని పెమ్మసాని అడిగారట. అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు పార్టీవర్గాల సమాచారం. నిజానికి పార్లమెంటుకు పోటీచేసేంత ఆర్ధిక స్తోమత కలిగిన వాళ్ళు ఇపుడు చంద్రబాబుకు చాలా అవసరం.
ఈ నేపధ్యంలోనే పెమ్మసాని అభ్యర్ధిత్వం విషయంలో చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారట. చంద్రబాబు టికెట్ ఓకే చేయటం వల్లే పెమ్మసాని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను ఆపీసులు ఓపెన్ చేసుకున్నారు. తన మనుషులను ఆఫీసుల్లో నియమించుకుని సొంతంగానే రన్ చేస్తున్నారు. కొంతమంది తమ్ముళ్ళు ఎన్ఆర్ఐతో రెగ్యులర్ టచ్ లో ఉంటున్నట్లు తెలిసింది. కాకపోతే ఇక్కడో చిన్న సమస్యుంది. అదేమిటంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు విషయం ఇంకా ఫైనల్ కాలేదు. పొత్తులు ఫైనల్ అయితే గుంటూరు సీటు ఏ పార్టీకి పోతుందో తెలీదు. ఇదొక్కటే అయోమయంగా మారింది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
ప్రతిఫలం ఆశించకుండా ప్రజాసేవ చేసే నిస్వార్థ నాయకుడు చంద్రబాబు గారు.
అలాంటి వ్యక్తి కోసం మేమంతా ఎంతైనా కష్టపడతాం, ఆయన పాలనను మళ్లీ తీసుకొస్తాం.#PemmasaniForGuntur #ChandraBabuNaidu #JaiTDP #TDPWillBeBack #Guntur #AndhraPradesh pic.twitter.com/T8YWqemcQC
— Dr. Chandra Sekhar Pemmasani (@PemmasaniOnX) February 16, 2024