వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ ల కిడ్నాప్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి చెందిన ఎంపీ కుటుంబానికి విశాఖపట్నంలో రక్షణ లేదని, అటువంటి విశాఖకు రాజధాని తరలిస్తానని సీఎం జగన్ చెబుతున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ఇక, ఆ కిడ్నాప్ వ్యవహారం తర్వాత విశాఖలో తన వ్యాపారం కంటిన్యూ చేయడానికి ఎంవీవీ ఇష్టపడడం లేదని, తన వ్యాపారాలను హైదరాబాద్ కు తరలించేందుకు ఆయన సిద్ధమయ్యారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
అయితే, తాను ఆ కిడ్నాప్ వ్యవహారం నేపథ్యంలో భయపడతానా అంటూ ఎంవీవీ ఆ ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆయన విశాఖలోని పరిస్థితులను చూసి హైదరాబాద్ కు బిజినెస్ తరలించే యోచనలో ఉన్నారని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఎంవీవీతోపాటు ఆయన కుమారుడు కూడా పోలీసుల సలహఆతో గన్ లైసెన్స్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా తుపాకీ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రచారం జరగడం చర్చనీయాంశమైంది.
అంతేకాదు, అమర్నాథ్ తో పాటు మరికొందరు వైసీపీ నేతలు కూడా రక్షణ కోసం గన్ లైసెన్స్ కోసం అప్లై చేసే పనిలో పడ్డారట. ఏదేమైనా ఏపీకి కొత్త రాజధాని విశాఖ అని, అక్కడే తాను ఇల్లు కట్టుకోబోతున్నానని జగన్ బల్లగుద్ది మరీ చెబుతున్న సందర్భంలో అధికార పార్టీకి చెందిన కీలక నేతలు అసాంఘిక శక్తులకు భయపడి గన్ లైసెన్సులకు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది. విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని డేట్ లు కూడా చెప్పిన అమర్నాథ్ స్వయంగా భయపడుతున్నవ్యవహారం పై సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ జరుగుతోంది. తాజాగా అమర్నాథ్ గన్ లైసెన్స్ అప్లై చేసుకోవడంతో విశాఖకు రాజధాని తరలే అవకాశం లేదని, అమరావతే రాజధాని అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పరోక్షంగా చెప్పినట్లేనని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.