గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైంది. రాజకీయాలతో దానికి సంబంధం ఉండదు. కానీ ఇప్పుడు తెలంగాణలో మారిన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళి సైని బీజేపీ నేతగా టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమెను దూరం పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక కారణాలు చెప్పి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడమే అందుకు నిదర్శనమని విశ్లేషకులు సైతం అంటున్నారు.
ఇప్పుడు పరిస్థితులు కేంద్రం వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా మారాయి. కేంద్రంపై పోరు బావుటా ఎగరేసిన సీఎం కేసీఆర్.. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోడీని దేశం నుంచి తరిమికొట్టాలని ఆయన పేర్కొనడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా టీఆర్ఎస్కు గట్టి కౌంటరే ఇస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ నేతగా గవర్నర్‌ను చూస్తూ ఆమెను కేసీఆర్ దూరం పెడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై తమిళి సై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ విభేదాలు మరింత ముదురుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బడ్జెట్ సమావేశాలకు ముందు తన ప్రసంగం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన తమిళి సై ఓ ప్రకటన విడుదల చేశారు. తాను రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నానని ఆమె పేర్కొన్నా.. ఓ గవర్నర్ ఇలా ప్రకటన విడుదల చేయడం అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆమె ప్రకటనకు కౌంటర్‌గా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన ఆమె పాత వాసన వదులుకోలేదని ప్రభుత్వ నిర్ణయాలను తిరస్కరిస్తున్నారని అందులో ప్రభుత్వం పేర్కొంది. ఆమె తన పద్ధతి మార్చుకోకపోతే ఇక్కడ పని చేయలేరని కూడా హెచ్చరించడం గమనార్హం.