టీఆర్ఎస్ కు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) గుడ్ బై చెప్పేశారా ? పార్టీలో ఇపుడిదే చర్చనీయాంశమైంది. నేతలందరు ఈ విషయాన్ని బాగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే పీకే ఇచ్చిన సర్వేల కారణంగానే చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సర్వేల ఆధారంగా తమకు టికెట్లు దక్కేది అనుమానమే అని చాలామంది ఎంఎల్ఏలు నిర్ణయానికి కూడా వచ్చారు. దాంతో పార్టీలో పీకే సర్వేలపై బాగా వ్యతిరేకత వచ్చేసింది.
ఈ నేపధ్యంలో కేసీయార్-పీకే మధ్య ఏమి జరిగిందో సరిగ్గా ఎవరికీ తెలీదుకానీ రాజకీయ వ్యూహకర్త గుడ్ బై చెప్పేస్తున్నారన్న విషయం బయటపడింది. మొదట్లో పీకేతో ఒప్పందం చేసుకున్నపుడు తెలంగాణా వరకే పరిమితం. అయితే కొంతకాలం క్రితం జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో కేసీయార్ తో కలిసి పనిచేయటానికి పీకే అంగీకరించలేదట. దాంతో ఇద్దరిమధ్య విభేదాలు మొదలైనట్లు సమాచారం.
ఇదే సమయంలో పీకే ఇచ్చే నివేదికలను కేసీయార్ పట్టించుకోవటంలేదట. అసలు మాట్లాడటానికి పీకేకి కేసీయార్ సమయమే ఇవ్వటంలేదని పార్టీవర్గాలు చెప్పాయి. ఈ కారణంగానే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిల నేపధ్యంలో చేస్తున్న సర్వేని పీకే బృందం అర్ధాంతరంగా ముగించుకున్నట్లు సమాచారం. పార్టీలోని సీనియర్లతో భేటీల కారణంగా పీకే నివేదికలపై కేసీయార్ కు ఎందుకనో నమ్మకం తగ్గిపోయిందట. దాని కారణంగానే పీకే తో భేటీకి ఇష్టపడటం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గడచిన ఆరుమాసాలుగా పీకే బృందం టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నది. తన బృందంతో తెలంగాణా మొత్తంలో తిరుగుతు విస్తృతంగా సర్వేలు చేస్తున్నది. ఈ నేపధ్యంలోనే పీకేకి టీఆర్ఎస్ సీనియర్లతో బాగా గ్యాప్ వచ్చేసింది. ఎంఎల్ఏల్లో అత్యధికులు పీకేకి వ్యతిరేకమైపోయారు. ఎంతచేసినా తాను రాజకీయం చేయాల్సింది ఎంఎల్ఏలతోనే కాబట్టి చివరకు పీకే సర్వే నివేదికలను కేసీయార్ పక్కనపెట్టేశారట. ఇలాంటి అనేక కారణాలతో టీఆర్ఎస్ కు పీకే గుడ్ బై చెప్పేస్తున్నట్లు సమాచారం.