ఇటీవలకాలంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ త్వరగా ఆగ్రహాన్ని వ్యక్తమవుతున్నారు. ఏ చిన్న తేడా తన వరకు వచ్చినా.. ఆమె ఫైర్ అవుతున్నారు. ఈ మధ్యనే తెలంగాణలో పర్యటించిన సందర్భంగా ఆమె ధాటికి జిల్లా కలెక్టర్ సైతం నీళ్లు నమలాల్సి వచ్చింది. అయితే.. ఆమె తీరుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. తాజాగా ఏపీలో పర్యటించిన సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఆమె క్లాస్ పీకారు. ఆమె కోపంతో విరుచుకుపడిన వేళ.. సమాధానం చెప్పలేక ఇబ్బందికి గురయ్యారు వైసీపీ ఎమ్మెల్యే. ఇంతకూ నిర్మలమ్మకు అంత కోపం ఎందుకు వచ్చింది? వైసీపీ ఎమ్మెల్యేను ఎందుకు క్లాస్ పీకారన్న విషయంలోకి వెళితే..
తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం మండలంలోని మత్స్యపురిలో పర్యటించారు. ఆమె వెంట ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడి స్థానికులు తమకున్న తాగునీటి సమస్య గురించి ఆమె వద్ద ప్రస్తావించారు. దీనికి ఆమె ఆశ్చర్యపోవటంతో పాటు.. ఆగ్రహానికి గురయ్యారు. కారణం.. ఆమె ఏపీ ఎంపీగా ఉన్నప్పుడు.. ఈ తాగునీటి సమస్య తన వరకు రావటంతో తన ఎంపీ నిధుల నుంచి రూ.1.25 కోట్లు మంజూరు చేశానని.. అయినప్పటికీ ఇప్పటికి నిధులు ఖర్చు చేయకపోవటం ఏమిటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఏపీ ఎంపీ నుంచి కర్ణాటక ఎంపీగా మారానని.. అయినప్పటికీ ఇంకా తాను విడుదల చేసిన నిధులతో పని చేయించలేదా? అంటూ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాను ఎప్పుడో విడుదల చేసిన నిధుల్ని ఖర్చు చేసేందుకు మీ ఎమ్మెల్యేకు సమయం దొరకలేదని.. డబ్బులు ఇచ్చినా నీళ్లు ఎందుకు రాలేదని.. మీ ఎమ్మెల్యేను నిలదీయాలని ఆమె అక్కడ చేరిన ప్రజలను సూచన చేయటం గమనార్హం. నిధులు మంజూరు చేసినా నీళ్లు ఎందుకు రాలేదని.. ఎమ్మెల్యేను ప్రశ్నించాలని.. అలా అయినా ఈ ఏడాది చివరకు అయినా నీళ్లు వస్తాయేమో చూద్దామని వ్యాఖ్యానించటం గమనార్హం.