10 రోజులుగా ఏర్పడిన సస్పెన్స్ కు తెరదించుతూ మహారాష్ట్ర కు కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది. ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు గడుస్తున్నా సీఎం ఎవరన్న విషయంపై క్లారిటీ రాలేదు. సీఎం పదవిపై ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ముగ్గురూ ఆశలు పెట్టుకోవడంతో మూడు ముక్కలాట నడిచింది. అయితే, ఈ సారి ఎన్నికల్లో బీజేపీ 132 స్థానాలు గెలుచుకోవడంతో ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ అగ్రనేతలు భావించారు. కొద్ది రోజులు షిండే అలకబూనినా..ఆయనకు నచ్చజెప్పి ఫడ్నవీస్ కు లైన్ క్లియర్ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఈ రోజో ముంబై విధాన్ భవన్ లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల శాసనసభా పక్ష సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. షిండే, అజిత్ పవార్ లు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 43 మంత్రులకుగాను 21 బీజేపీ, శివసేన (షిండే) వర్గం 12, ఎన్సీపీ (అజిత్ పవార్ ) వర్గం 10 పంచుకున్నాయి. ముంబైలోని ఆజాద్ మైదానంలో డిసెంబరు 5న సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు, ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు కీలక నేతలు, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు కూడా హాజరు కాబోతున్నారు.