కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఈడీ అధికారులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఊహించడానికి కూడా అవకాశం లేని విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు తర్జన భర్జనలో పడ్డారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) సీల్ చేసింది . మంగళవారం నుంచి ఢిల్లీ, లఖ్‌నవూ, కోల్‌కతాలో 10 నుంచి 12 చోట్ల అనేక గంటలపాటు సోదాలు జరిపిన ఈడీ.. కాంగ్రెస్‌కు చెందిన హెరాల్డ్ హౌస్‌లోని యంగ్ ఇండియన్ ఆఫీస్‌ను సీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
తమ అనుమతులు లేకుండా ఆ కార్యాలయాన్ని ఎవరూ తెరవకూడదని స్పష్టం చేసింది. మంగళవారం జరిపిన ఈడీ దాడుల్లో అధికార ప్రతినిధులు హాజరుకానందున సాక్ష్యాలను సేకరించలేకపోయామని, వాటిని భద్రపరిచేందుకే తాత్కాలికంగా సీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌లో యంగ్ ఇండియన్ సంస్థ మినహా మిగతా కార్యకలాపాలు కొనసాగించుకో వచ్చని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, జన్‌పథ్‌లోని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి వద్ద భారీ సంఖ్యలో మోహరించారు. ఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే రోడ్డును ఎందుకు బ్లాక్ చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఇది ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. ఇలా ఎందుకు చేస్తున్నారో మిస్టరీగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసి.. మోహరించినట్లు పోలీసులు చెబుతున్నారు.
r65wwk