“ఏపీ సీఎం జగన్ పైకి కనిపిస్తున్నంత మంచోడు కాదు. నన్ను చంపించేస్తారనే భయం ఉంది. ఎక్కడిక క్కడ నాపై నిఘా పెట్టారు. నన్ను వెంబడిస్తున్నారు. నా భార్యను పోలీసులు బెదిరిస్తున్నారు. మా నాన్నపై దాడులు చేస్తున్నారు. కాబట్టి.. నాకు మరింత రక్షణ కల్పించండి“ అని ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో నిందితుడిగా ఉండి.. అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. తాజాగా కోర్టును ఆశ్రయించారు. తక్షణమే తనకు రక్షణ కల్పించాలని విన్నవించారు.
హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో ఆయన ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, ఎంపీ అవినాష్‌రెడ్డి, నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆయన తనయు డుని చేర్చారు. వీరిని విచారించాలని కూడా దస్తగిరి కోరాడు. తనను బెదిరిస్తున్నారని.. దస్తగిరి తెలిపాడు. ఇటీవల తాను ఓ కేసులో జైల్లో ఉన్న సమయంలో 20 కోట్ల రూపాయల ఆఫర్ చేశారని.. సునీత కు వ్యతిరకంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేశారని అన్నాడు.
ఎన్నికల వేళ.. తనపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, ఈ క్రమంలోనే తనకు ప్రాణ భయం కూడా వెంటాడుతోందని అన్నారు. “గతంలో కడపలో జరిగిన అనేక పరిణామాలను గమనిస్తే.. పైకి కనిపిస్తున్న విధంగా జగన్ మంచోడుకాదని.. ఇక్కడివారు చెబుతున్నారు. ఎంతో మందిని ఆయన రాజకీయంగా అణిచేశారు. కొంత మంది అడ్రస్ ఇప్పటికీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తనకు, తన కుటుంబానికి సీబీఐ నుంచి భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు.
మరోవైపు, వివేకా దారుణ హత్య కేసులో బెయిల్‌పై బయట ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ కూడా దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం గమనార్హం. తక్షణమే బెయిల్‌ను రద్దు చేయాలని.. లేక పోతే వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే.. దస్తగిరి వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి జైభారత్ భీం అంబేద్కర్ పార్టీ తరపున పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే.